కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రైతాంగానికి సంబంధించి కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కమిషన్‌ల ప్రాజెక్టుగా మారిందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పేరుతో యువత భవిష్యత్తుతో ఆటలాడారని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగినప్పటికీ, కేంద్రం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చూపుతోందని ఎంపీ ఆరోపించారు. FCI కోటా పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. యూరియా సరఫరా సమస్యపై కూడా ఆయన కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గిందని, దీనిపై పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని పేర్కొన్నారు.

