కలం, స్పోర్ట్స్ : భారత్-పాకిస్థాన్ ఫైట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ పోరు ఎక్కువసేపు సాగలేదు. భారత స్టార్ సంగ్రామ్ సింగ్ కేవలం 1 నిమిషం 20 సెకన్లలోనే పాకిస్థాన్ ఫైటర్ మహ్మద్ అబిద్ అలీని నాకౌట్ చేశాడు. దీంతో ప్రతిష్టాత్మక స్ట్రైక్ ఆసియా ఛాంపియన్‌షిప్ టైటిల్ (Asia Champion Title)ను సొంతం చేసుకున్నాడు. పోరు ప్రారంభమైన క్షణం నుంచే సంగ్రామ్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. పవర్, టెక్నిక్, ఖచ్చితత్వంతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్‌లోనే నాకౌట్ చేసి తన సత్తా చాటాడు.
ఈ విజయంతో సంగ్రామ్ సింగ్ తన అజేయ ప్రొఫెషనల్ ఎంఎంఏ రికార్డును కొనసాగించాడు. రెజ్లింగ్ నుంచి ఎంఎంఏకు విజయవంతంగా మారిన ఆటగాడిగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయం తర్వాత ఈ టైటిల్‌ను భారత ప్రజలకు అంకితం చేసినట్లు సంగ్రామ్ తెలిపాడు. క్రీడలు దేశాలు, మతాలు, సంస్కృతులకు అతీతంగా ప్రజలను కలుపుతాయని చెప్పాడు. తన సందేశం శాంతి, మానవత్వం, పరస్పర గౌరవమని పేర్కొన్నాడు.
పోటీకి ముందు మహ్మద్ అబిద్ అలీ ముస్లింలపై తన అభిమానాన్ని వ్యక్తం చేయగా, సంగ్రామ్ మాత్రం ప్రపంచంలోని ప్రతి మనిషిపైనా తనకు సమానమైన ప్రేమ, గౌరవం ఉందని చెప్పినట్లు వెల్లడైంది. ఇది సంగ్రామ్ సింగ్ అంతర్జాతీయ ఎంఎంఏ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే విజయం. ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన అలీ రజా నాసిర్, ట్యునీషియాకు చెందిన హకీమ్ ట్రాబెల్సీ, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోరియన్ కౌడియర్‌లపై కూడా అతడు విజయాలు సాధించాడు.
భారత్-పాక్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. దీంతో లైవ్ స్ట్రీమింగ్‌కు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. అయినా సంగ్రామ్ 80 సెకన్ల నాకౌట్ విజయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

