కలం, స్పోర్ట్స్ : గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ (Swimming Championship)లో రంగారెడ్డి జిల్లా ఈతగాళ్లు పతకాల పంట పండించారు. ముఖ్యంగా బాయ్స్ విభాగంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎ. అశ్వత్ 50 మీటర్ల బటర్‌ఫ్లై రేస్‌ను 29.06 సెకన్లలో, 100 మీటర్ల బటర్‌ఫ్లై రేస్‌ను 1:07.05 సెకన్లలో ముగించి రెండేసి బంగారు పతకాలతో అదరగొట్టాడు. ఈ రెండు ఈవెంట్లలోనూ రంగారెడ్డి జిల్లాకే చెందిన అర్జున్ సందీప్ కస్వాన్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకాలను గెలుచుకోగా, హైదరాబాద్‌కు చెందిన దారా ప్రతీక్, ఇధాంత్ సాయిలు కాంస్య పతకాలను దక్కించుకున్నారు.
మరోవైపు 800 మీటర్ల ఫ్రీస్టైల్ రేస్‌లో మేడ్చల్‌కు చెందిన ఇ. స్టాష్ జోసెఫ్, కె. శ్రీ మను కార్తికేయలు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకోగా, నిజామాబాద్‌కు చెందిన ఎం. మోహన్ దుర్గ మూడో స్థానంలో నిలిచాడు. గర్ల్స్ విభాగంలోనూ రంగారెడ్డి జిల్లా క్రీడాకారిణి జి. వేధ ఆశ్రిత గొట్టుముక్కల డబుల్ గోల్డ్‌తో మెరిసింది. ఆమె 50 మీటర్ల బటర్‌ఫ్లై రేస్‌ను 31.55 సెకన్లలో, 100 మీటర్ల బటర్‌ఫ్లై రేస్‌ను 1:12.72 సెకన్లలో పూర్తి చేసి రెండు పసిడి పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
ఈ పోటీల్లో రంగారెడ్డికి చెందిన జోనా షిజు, మేడ్చల్‌కు చెందిన అంజలి శర్మలు రజత పతకాలు సాధించగా, మేడ్చల్‌కు చెందిన మేఘన అబినేష్, రంగారెడ్డికి చెందిన నేహా వినోద్‌లు కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక 200 మీటర్ల ఫ్రీస్టైల్ రేస్‌లో మేడ్చల్‌కు చెందిన తేజశ్రీ విద్యాసాగర్ అగ్రస్థానంలో నిలవగా, వరంగల్‌కు చెందిన అవ అదిద్య సాధన, హైదరాబాద్‌కు చెందిన కె. హవిష తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు స్థానిక యువ ఈతగాళ్ల ప్రతిభను చాటడానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి.

