కలం, వెబ్ డెస్క్: కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి రోడ్డుపక్కన టీ స్టాల్ (Tea Stall) ప్రారంభించిన ఓ వ్యక్తి విజయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎక్స్‌లో ఐయామ్ కిట్ పాండే అనే యూజర్ సక్సెస్ స్టోరీని షేర్ చేశాడు. టెలిపర్ఫార్మెన్స్‌లో నెలకు రూ.38 వేల జీతంతో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి ఎదుగుదలకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సుమారు రూ.2 లక్షల పెట్టుబడితో ఆటో స్టాండ్ సమీపంలో టీ స్టాల్ ప్రారంభించాడు.
టీ స్టాల్‌లో రూ.10కు సాధారణ టీ, రూ.20కు స్పెషల్ టీ విక్రయిస్తున్నాడు. టీ తయారీ, సర్వింగ్ కోసం ఇద్దరు మహిళలను ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం రోజుకు సుమారు 400 కప్పుల టీ విక్రయిస్తూ రోజుకు దాదాపు రూ.6 వేల ఆదాయం, నెలకు సుమారు రూ.1.8 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాడు. అద్దె, సిబ్బంది జీతాలు, ముడిసరుకు ఖర్చులు తదితర వ్యయాలు పోగా నెలకు దాదాపు రూ.1 లక్ష స్వచ్ఛమైన లాభం పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల వడా పావ్, సమోసా, జిలేబీ కౌంటర్లను కూడా ప్రారంభించాడు.
ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. వేలాది మంది దీన్ని వీక్షించగా, పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. “ఒక టీ స్టాల్ విజయవంతమైతే, మరో 99 స్టాల్స్ మూతపడే పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారం చేయడం అంత సులువు కాదు” అని కొందరు వ్యాఖ్యానించగా, “రిస్క్ తీసుకునే ధైర్యమే జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది” అంటూ మరికొందరు ప్రశంసించారు.

