కలం, వెబ్ డెస్క్: వచ్చే ఏడాది నిర్వహించనున్న కాలుష్యరహిత గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu 2027) కోసం ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందుకోసం 6 జిల్లాల పరిధిలో గుర్తించిన 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గోదావరి నదిలో కాలుష్య కారక వ్యర్థాల విడుదలను నిలువరించేందుకు నిరంతర పర్యవేక్షణా వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యవేక్షణ బాధ్యతను ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కి అప్పగించనున్నట్టు స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నివారణా చర్యలు చేపట్టాలని.. అవసరమైతే వీబీ జీ రాం జీ, స్వచ్ఛాంధ్ర, కాలుష్య నియంత్రణ మండలి నిధులను కూడా వినియోగించుకోవాలని చెప్పారు.
262 పుష్కర పంచాయతీలు..
పుష్కరాల నిర్వహణ నిమిత్తం 262 పుష్కర పంచాయతీలను అధికారులు గుర్తించారు. డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శుల సమన్వయ సమావేశం నిర్వహించి 262 పంచాయతీలను పుష్కరాల నాటికి మురుగు విడుదల రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పవన్ సూచించారు. ప్రతి రోజూ గోదావరిలో గ్రామీణ ప్రాంతాల మురుగు 8.38 మిలియన్ లీటర్లు కలుస్తున్నట్లు గుర్తించారు. ఈ మురుగు నిర్వహణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
ప్రమాదకర స్థితికి ఆక్వా కాలుష్యం..
గోదావరి నదిలో కలుస్తున్న ఆక్వా కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరినట్టు పీసీబీ అధికారుల పరిశీలనలో తేలింది. ఆరు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుంచి సుమారు రోజుకి 104 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిని కలుషితం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి రోజు మరో 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలిపేస్తున్నారు. అందులో ఒక్క ఆంధ్రపేపర్ మిల్స్ నుంచే రోజుకి 32 మిలియన్ లీటర్ల వరకు వ్యర్థాలు విడుదల కావడం గమనార్హం. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం విడుదల అవుతున్న 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటికి అదనంగా కలుస్తోంది. దీనిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం (Pawan Kalyan) ఆదేశించారు.
Read Also: పరీక్షల నిర్వహణలో లోపాలు.. NTAపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Follow Us On : WhatsApp

