కలం, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు 2026 నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పవన్ కల్యాణ్ తన తదుపరి భారీ చిత్రాన్ని ప్రకటించారు. కొంతకాలంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సురేందర్ రెడ్డి (Surender Reddy) ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. కిక్, ధృవ, రేసుగుర్రం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నారు.
ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన నూతన నిర్మాణ సంస్థ జైత్ర రామ మూవీస్ కింద ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో కలిసి దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌కు టైటిల్‌ను పవన్ కల్యాణ్ స్వయంగా సూచించారని నిర్మాత వెల్లడించారు. పవన్ ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం.
నిజానికి ఈ ముగ్గురి కలయికలో సినిమా రావాలని 2021లోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితులు, పవన్ రాజకీయ పనుల కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2026లో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఓజీ వంటి భారీ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్, షూటింగ్ షెడ్యూల్, మిగిలిన నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
Read Also: ఆ యంగ్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా సినిమా..?
Follow Us On: Youtube


