మత్స్యకారులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) భరోసా ఇచ్చారు. వారికి ఉన్న అన్ని సమస్యలను ప్రాధాన్యత పరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కీలక ముందడుగు వేశారు. కాకినాడ జిల్లా ఉప్పాడ(Uppada) తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో పరిశ్రమలు, మత్స్యశాఖ కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఉంటారు. వీరితో పాటు కలెక్టర్ ద్వారా నామినేట్ అయ్యే మత్స్యకార వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారుల సమస్యలను వారి దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి, కమిటీ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ధన్యావాదాలు అని పవన్(Pawan Kalyan) పేర్కొన్నారు.

