కల్తీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వంపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారావారి సారా ఏ స్థాయిలో అమ్మతున్నారో ఈ అంశంతో అర్థమైపోతోందంటూ విమర్శలు చేశారు. నారావారి ఎన్ బ్రాండ్(N Brand)తో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో నకిలీ మద్యం కంపెనీలను రన్ చేస్తూ ప్రజల ప్రాణాల వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొలకల చెరువులో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి ఎన్ బ్రాండ్ గుట్టు రట్టు చేయడంతో టీడీపీ అడ్డంగా బుక్ అయిందంటూ చురకలంటించారు.
మొలకలచెరువలో తయారు చేసిన కల్తీ మద్యాన్ని రాయలసీమకు, కృష్ణా జిల్లాలో తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని కోస్తాంధ్రాకు తరలిస్తున్నారని, ఈ అక్రమ వ్యాపారంతో కోట్ల రూపాయు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కల్తీ మద్యం ద్వారా రూ.5,280 కోట్ల వరకు వారు అమ్మకాలు చేశారని అన్నారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా 48 కోట్ల క్వార్టర్ బాటిళ్లపై కేసులు నమోదయ్యాయి. ఏడాదిలోనే ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నారు. రూ.5,280 కోట్ల స్కాంకు తెరలేపారు. ఆధారాలతో సహా అడ్డంగా బుక్ అయ్యారు. అయినా ఈ సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇలాంటి ప్రభుత్వానికా మనం ఓట్లు వేశాం అని ప్రజలు బాధపడుతున్నారు. నారావారి ఎన్ బ్రాండ్ సారా అమ్మడం అంటే ప్రజల బలహీనతను సొమ్ము చేసుకొని దెబ్బకొట్టడమే. ఈ తప్పు చంద్రబాబు(Chandrababu) ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది కప్పిపుచ్చుకోలేని తప్పు. దీనికి రానున్న కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. విచారణ చేపట్టాలి’’ అని అవినాష్(YS Avinash Reddy) డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను తప్పించడానికి ప్రభుత్వం నానా ప్రయాసలు పడుతోందని ఆరోపించారు.

