కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీరులో (Jammu Kashmir) ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆపరేషన్ షేరువాలీ కొనసాగుతోంది. ముష్కరులపై భారత జవాన్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. రాజౌరీ సెక్టారులోని డోరిమాల్ అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల కిందట నలుగురు ఉగ్రవాదులు చొరబడ్డారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్న సీఆర్పీఎఫ్, జమ్మూ పోలీసులు, ఎస్వోజీ కమెండోలు కూంబింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో.. బలగాలు ధీటుగా స్పందించాయి. ఒక ఉగ్రవాదిని అంతమొందించగా.. మిగతావారి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.
దట్టమైన అడవుల్లో స్థావరం ఏర్పాటు..
డోరిమాల్ అటవీ ప్రాంతం అత్యంత దట్టంగా ఉండటంతో.. అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుని దాడికి ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అదనపు బలగాలతో పాటు అవసరమైన సామగ్రిని ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తరలిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా, అటవీ ప్రాంతాన్ని చుట్టూ రౌండప్ చేసి కాల్పులు జరుపుతున్నారు. ఆపరేషన్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.

