Mobile Popup Ad
Mobile Popup Ad

అన్నీ ఒకే చోట.. ప్రతి పౌరుడికి ‘సమగ్ర సంక్షేమ కార్డు’ : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (Unified Welfare Card) ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎస్ కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్ర సంక్షేమ కార్డు (Unified Welfare Card) ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని, అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందన్నారు.

వేర్వేరుగా కార్డులు ఉండే బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలన్నారు. ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని సీఎం సూచించారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా సమగ్ర కార్డుకు అనుసంధానం చేయాలన్నారు.

లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఏఐ ఆధారంగా ప్రొఫైలింగ్ జరగాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని ఆయన సూచించారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: వామ్మో ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర

Read Also: పిల్లల్ని కనడం లేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>