Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం కేసు.. ఇద్దరు అరెస్ట్

కలం, నల్లగొండ: నల్లగొండ పట్టణంలో జూన్ 6న తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) దహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్లగొండ టూ టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరిపారు. విద్వేషాలు రేపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 6న తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఎన్.జి. కళాశాల సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగులబెట్టారు.

మున్సిపల్ 48వ వార్డు అధికారి బుజనూరి స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ (Nalgonda) టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.232/2026 కింద BNS సెక్షన్లు 326(F), 196, 126(2), 324(4), 292, PDPP Act-1984 సెక్షన్-4 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలతో అనుమానాస్పద వాహనాల కదలికలను, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుల జాడను కనిపెట్టారు. పోలీసుల విచారణలో నిందితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని ధ్వంసం చేయడం ద్వారా ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించాలని ప్రణాళిక వేసినట్లు తేలింది.

ఈ కుట్రలో భాగంగానే మొదట నల్లగొండలోని విగ్రహాన్ని (NTR Statue) ఎంచుకున్నారు. జూన్ 6న నిందితులు కారులో వచ్చి, రెండు పాత బెడ్‌షీట్లను విగ్రహంపై కప్పి, లీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన లెక్చరర్ పాలకురి అశోక్ కుమార్ గౌడ్ (45), మహేశ్వరానికి చెందిన ఎలుకంటి ప్రణీత్ (23) ఉన్నారు. వీరు వాడిన కారుతోపాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ ఎస్. రాఘవరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు డి. చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రూరల్ ఎస్‌ఐ డి. సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరితోపాటు సీసీఎస్, టూ టౌన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: మెస్సీ కంటతడి వెనుక కారణం ఇదే..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>