కలం, వెబ్ డెస్క్ : అభివృద్ధి, ఉద్యోగాల వికేంద్రీకరణ ద్వారానే సమాజంలో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సీతక్క, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ వంటి నగరాలకు మాత్రమే ఐటీ పరిశ్రమలు పరిమితం కాకూడదని, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో కూడా ఐటీ రంగం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరిగితేనే మారుమూల ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు లభిస్తాయని మంత్రి సీతక్క (Minister Seethakka) వెల్లడించారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్‌లను అభివృద్ధి చేసి వివిధ పాఠశాలలు, సంస్థలు, ఐటీ రంగానికి సేవలు అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ములుగు (Mulugu) జిల్లాలో ఇతర ఐటీ సంస్థలు, కంపెనీలు స్థాపించడానికి ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని మంత్రి హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకులు రవికుమార్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. అవసరమైతే మళ్లీ యుద్ధం
Follow Us On: X(Twitter)

