కలం, ఖమ్మం బ్యూరో: భక్త రామదాసు (కంచర్ల గోపన్న) భక్తితో, స్వేదంతో 17వ శతాబ్దంలో నిర్మించిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం (Bhadrachalam Temple) నేడు పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సుమారు 14 ఏళ్లుగా ఈ దివ్య క్షేత్రానికి పూర్తిస్థాయి పాలక మండలి లేకపోవడంతో ఆలయ అభివృద్ధి కుంటుపడుతోంది. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల నాటికి ఆలయాన్ని రూ.351 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే ‘నాథుడు’ లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
ముగ్గురు మంత్రుల ఆధిపత్య పోరే కారణమా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకు ముందు రెండేళ్లు మొత్తం 14 ఏళ్లుగా భద్రాచలం ఆలయానికి (Bhadrachalam Temple) పాలక మండలి భాగ్యం కలగలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు కీలక మంత్రుల మధ్య నెలకొన్న ‘ఆధిపత్య పోరు’ మరియు ‘అభిప్రాయ భేదాలు’ ఈ జాప్యానికి ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని తమ అనుచరులకు కట్టబెట్టాలనే పంతం వల్లనే ఈ నియామకాలు పెండింగ్‌లో పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆలయభూములు అన్యాక్రాంతం
2012 నవంబర్ 25తో 13వ ట్రస్ట్ బోర్డు గడువు ముగియగా, అప్పటి నుంచి నేటి వరకూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో ఆలయ భూములకు రక్షణ లేక అన్యాక్రాంతం అవుతున్నాయని రామ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 800 ఎకరాల ఆలయ భూములు. అలాగే ఏడాదికి సుమారు రూ. 80 కోట్ల ఆదాయం, సంవత్సరానికి 50 లక్షల పైచిలుకు భక్తులతో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రానికి 14 ఏళ్లుగా పాలక మండలి లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెచ్చిపోతున్న అక్రమార్కులు
పాలక మండలి లేకపోవడంతో అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నప్పటికీ, స్థానిక అక్రమార్కులను అడ్డుకోవడంలో వారు విఫలమవుతున్నారు. గతంలో భూములను రక్షించేందుకు వెళ్లిన ఆలయ అధికారిణి (ఈఓ) రమాదేవిపై జరిగిన దాడి దీనికి పరాకాష్ట. ప్రజాప్రతినిధులతో కూడిన బోర్డు ఉంటేనే రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని భూములను కాపాడటం సాధ్యమవుతుందని స్థానిక నాయకులు వాపోతున్నారు. 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ప్రభుత్వం రూ. 586 కోట్లు కేటాయించి, ఇప్పటికే రూ. 351 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ఆ పనుల నాణ్యతను, వేగాన్ని పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? అధికారుల మాట అక్రమార్కులు వినని ప్రస్తుత పరిస్థితుల్లో, ఒక శక్తివంతమైన ట్రస్ట్ బోర్డు లేకపోతే అభివృద్ధి పనులు నీటి మూటలుగా మిగిలే ప్రమాదం ఉంది.
రెండేండ్ల నుంచి ఎదురుచూపులు
ఇప్పటికైనా జిల్లా మంత్రులు పంతాలకు పోకుండా, నిష్పక్షపాతంగా భద్రాద్రికి కొత్త పాలక మండలిని నియమించి, దక్షిణ అయోధ్య వైభవాన్ని కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం భద్రాచలాన్ని పూర్తి నిర్లక్ష్యానికి గురి చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా పాలక మండలినీ ఏర్పాటు చేయకపోదా ? అని రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని భక్తులు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కు, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాగే సభ్యులకు కూడా రాష్ట్ర స్థాయిలో గౌరవం లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేను దరఖాస్తు కూడా చేసుకున్నాను. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లూ మాత్రమే అధికారంలో ఉండనుంది. కాబట్టి ఇప్పటికైనా ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసి ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వాళ్లని అందులో భాగస్వామ్యం చేయాలంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఆశావహుడు అభిప్రాయపడ్డారు.
Read Also: మోదీ ఇంధన పొదుపు పిలుపు.. క్యాబ్ డ్రైవర్లకు కష్టకాలం
Follow Us On : WhatsApp

