Mobile Popup Ad
Mobile Popup Ad

మారుతున్న కాలానుగుణంగా ‘బీఎడ్’ మారాలి.. ఆచార్య మృణాళిని

కలం, నల్లగొండ: మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో సమూల మార్పులు రావాలని, భవిష్యత్ భారత నిర్మాణానికి బీఎడ్ సిలబస్ (B.Ed Syllabus) పునర్వ్యవస్థీకరణ అనివార్యమని ప్రముఖ విద్యావేత్త ఆచార్య మృణాళిని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ‘విద్య వారోత్సవాల’ సందర్భంగా బీఎడ్ అధ్యాపకులకు సిలబస్, మూల్యాంకనంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. భవిష్యత్ తరాల తలరాతను మార్చే మహాయజ్ఞంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆచార్య మృణాళిని పేర్కొన్నారు.

జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం.. సిలబస్‌ను నిరంతరం సమీక్షించి, పున:రూపకల్పన చేయడం విద్యాసంస్థల బాధ్యత అని వివరించారు. ఉపాధ్యాయ విద్యార్థులు కేవలం బోధకులుగా మాత్రమే కాకుండా, సమాజ మార్పుకు మార్గదర్శకులుగా, దీపస్తంభాలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు, అసైన్‌మెంట్లు, అంతర్గత మార్కుల విధానంపై అధ్యాపకులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

మూల్యాంకనం అనేది కేవలం మార్కుల కేటాయింపుకే పరిమితం కాకుండా, విద్యార్థి అభ్యాస ప్రయాణాన్ని మెరుగుపరిచే సాధనంగా ఉండాలన్నారు. యూనివర్సిటీ (MG University) రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ గురువులు తమ వృత్తిని పవిత్రమైన సేవగా భావించాలన్నారు. సమకాలీన జ్ఞానంతో తమను తాము నిరంతరం సన్నద్ధం చేసుకోవాలని కోరారు. పారదర్శకమైన మూల్యాంకన వ్యవస్థ ద్వారానే నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను తయారు చేయగలమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, వివిధ బీఎడ్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: సీఎం కాన్వాయ్ సైజ్ తగ్గింపు.. ఇప్పుడు ఎన్ని వాహనాలంటే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>