కలం, ఖమ్మం బ్యూరో: కళ్లముందే కష్టపడి పెంచిన పైరు నీళ్లు లేక ఎండిపోతుంటే ఆ రైతు గుండె తీవ్రంగా విలవిలలాడింది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, ఆవేదన ఆపుకోలేక నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి “మా పంటను కాపాడండి స్వామీ”.. అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఖమ్మం (Khammam) జిల్లా వైరా (Wyra) ఇరిగేషన్ (ఐబీ) కార్యాలయం వద్ద సోమారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
వైరా రిజర్వాయర్ పరిధిలోని పంట పొలాలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐబీ కార్యాలయం ముందు రైతులు భారీ నిరసన (Farmers Protest) చేపట్టారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 17 అడుగుల నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు వైరా ఎస్సై తమ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో పంట ఎండిపోతోందన్న బాధతో ఓ రైతు ఎస్సై కాళ్లను పట్టుకుని, ఎలాగైనా నీటిని విడుదల చేయించి తమను ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. సాగునీటి కోసం రైతు కాళ్లపై పడ్డ దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా చలించిపోయేలా చేసింది. అధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

