కలం, వెబ్ డెస్క్ : కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని అధినాయకత్వం పిలుపునిచ్చిన వేళ సోమవారం వరంగల్ (Warangal ) జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు బీఆర్ఎస్ మహిళలు ర్యాలీగా వచ్చారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
ఈ మేరకు రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు.. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులను ఎగ్గొట్టిందంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో వినయ్ భాస్కర్ ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తీవ్ర ఉద్రిక్తతల నడుమ బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టిన పోలీసులు వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

