కలం, వెబ్ డెస్క్: డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఆధారాలు చూపించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సవాల్ విసిరారు. వాళ్ల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేనందునే సభకు రావడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ.. సౌకర్యాలు పొందుతున్నారని విమర్శించారు.
వైసీపీ నేతలు సభకు రాకుండా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని, ఇక్కడికి వస్తే దొరికిపోతామనేదే వారి భయమని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీని అత్యంత పారదర్శకంగా ఒక్క తప్పు లేకుండా నిర్వహించామన్నారు. 2019–2024 మధ్య ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేని విశ్వసనీయత లేని వ్యక్తి.. తమ మీద ఆరోపణలు చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు.
విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు..
విద్యా రంగంలో టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉన్న ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గురుకులాల విధానం తెచ్చారని, దాని స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 14 డీఎస్సీలు జరిగితే.. అందులో 11 తన హయాంలోనే జరిగాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ మీదనే పెట్టి, 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

