కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం (Oil Crisis) నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభం ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు కేంద్రం పొదుపు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను కేంద్రం విడుదల చేసింది.
ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు క్వార్టర్ల నుండి ఆఫీసులకు నేరుగా వెళ్లేందుకు మెట్రో స్టేషన్ల మీదుగా ప్రత్యేక బస్సులు నడపాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు మెట్రో, బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యం ఇస్తామని ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల పనివేళల్లో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అన్ని ఆఫీసులు ఒకే సమయంలో ప్రారంభం కావడం వల్ల రహదారులపై వాహనాల రద్దీ పెరిగి ఇంధనం వృథా అవుతుందని భావిస్తున్న కేంద్రం.. వేర్వేరు సమయాల్లో (Shift Basis) పనిచేయడం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చని యోచిస్తోంది. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించడం ద్వారా ‘ఆర్థిక ఆత్మరక్షణ’ పాటిస్తూ ఇంధన పొదుపును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Read Also: భానుడి భగభగల వేళ.. వాతావరణ శాఖ చల్లని కబురు!
Follow Us On: Instagram

