కలం, నిజామాబాద్ బ్యూరో: యాసంగి సీజన్ ధాన్యం సేకరణలో నిజమాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4.24 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, సుమారు 18 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. ధాన్యం సేకరించేందుకు సహకార సొసైటీల ఆధ్వర్యంలో 428 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ 262, డీసీఎంఎస్ 32, మెప్మా ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గన్నీ సంచులు, లారీలకు భారీ డిమాండ్..
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తడంతో గన్నీ సంచులు, లారీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. చాలా చోట్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో రైతులు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసనలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పలు చోట్ల రైతుల వద్దకు వెళ్లి కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కొనుగోళ్లను వేగవంతం చేయించారు. అలాగే ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు దొడ్డు రకం ధాన్యం 60,951 మెట్రిక్ టన్నుల వరకు సేకరించారు.
గతేడాది కూడా ఇందూరే ఫస్ట్..
గతేడాది యాసంగిలో కూడా ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా ముందుంది. అప్పుడు 8 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాలంలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ రెండు సీజన్లలో కూడా నిజామాబాద్ జిల్లానే మొదటి స్థానంలో ఉండగా.. అదే ఉత్సాహంతో ఈ ఏడాది యాసంగిలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో సేకరణ కూడా పూర్తి కానుంది. మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే పక్క జిల్లా నుంచి కూడా ధాన్యం తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఇలా..
- మొత్తం కొనుగోలు కేంద్రాలు : 740
- సేకరించిన ధాన్యం: 6.08లక్షల మెట్రిక్ టన్నులు
- ధాన్యం విక్రయించిన రైతులు : 73,016 మంది
- చెల్లించిన సొమ్ము : 1,227.29 కోట్లు (65,746 మంది రైతులకు)

