తెలంగాణ లెజిస్లేచర్ కమిటీల ప్రకటన.. కడియంకు కీలక పదవి!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2026-27 సంవత్సరానికి సంబంధించిన వివిధ కమిటీ (Telangana Legislature Committees)ల చైర్మన్లు, సభ్యుల నియామక ప్రక్రియను అధికారికంగా పూర్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ లెజిస్లేచర్ విభాగం కీలక బులెటిన్‌ను విడుదల చేసింది. శాసనసభ, శాసనమండలి సభ్యులతో కూడిన ఉమ్మడి కమిటీలతో పాటు, ఉభయ సభల ప్రత్యేక కమిటీలకు చైర్మన్లను నామినేట్ చేస్తూ ప్రకటన జారీ చేశారు.

ఈ నియామకాల్లో భాగంగా అత్యంత కీలకమైన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా కడియం శ్రీహరి ఎంపికయ్యారు. అలాగే అమెనిటీస్ కమిటీ, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ, రూల్స్ కమిటీలకు తెలంగాణ శాసనసభ సభాపతి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, వివిధ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ కమిటీల ఏర్పాటు జరిగినట్లు శాసనసభ వర్గాలు వెల్లడించాయి.

వివిధ సామాజిక వర్గాల సంక్షేమ కమిటీల విషయానికి వస్తే, షెడ్యూల్డ్ కులాల (SC) సంక్షేమ కమిటీ చైర్మన్‌గా మేడిపల్లి సత్యం, షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్‌గా పాయం వెంకటేశ్వర్లు, వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమ కమిటీ చైర్మన్‌గా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నియమితులయ్యారు. వీటితో పాటు మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా లక్ష్మీకాంతరావు తోట, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా చిట్టెం పర్ణికా రెడ్డి, గ్రంథాలయ కమిటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ మట్టా రాగమయి బాధ్యతలు చేపట్టనున్నారు.

శాసనసభకు సంబంధించిన ప్రత్యేక కమిటీలలో పిటిషన్స్, ప్రివిలేజెస్ కమిటీలకు ఉప సభాపతి చైర్మన్‌గా ఉంటారు. ప్రభుత్వ హామీల కమిటీ బాధ్యతలను పట్లోళ్ల సంజీవ రెడ్డికి, ఎథిక్స్ కమిటీ బాధ్యతలను రేవూరి ప్రకాశ్ రెడ్డికి అప్పగించారు.

మరోవైపు శాసనమండలి ప్రత్యేక కమిటీల చైర్మన్ల వివరాలను కూడా బులెటిన్‌లో పొందుపరిచారు. మండలి పిటిషన్స్, ప్రివిలేజెస్ కమిటీలకు ఉప చైర్మన్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. రూల్స్ కమిటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కేతావత్ శంకర్, సభ ముందుంచిన పత్రాల కమిటీ చైర్మన్‌గా చల్లా వెంకట్రాం రెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ కమిటీలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>