Mobile Popup Ad
Mobile Popup Ad

’పోక్సో బాధితుల గోప్యత కాపాడాలి‘

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పోక్సో కేసుల బాధితులకు మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతూ భరోసా కేంద్రాల ద్వారా తగిన భద్రత కల్పిస్తున్నామని  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన “భరోసా సెంటర్” ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్,  కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అదనపు ఎస్పీ రాజేష్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ, మహిళలకు భరోసా కల్పించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

భరోసా కేంద్రాలతో అద్భుత ఫలితాలు

హింస, వేధింపులు , లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలకు తక్షణ సహాయం, రక్షణ అందించేందుకు తెలంగాణ పోలీస్ విభాగ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘భరోసా కేంద్రాలు’ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు. బాధితులకు ఒకే చోట అన్ని రకాల సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించడం వల్లే అనేక వేధింపులు, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు.

శారీరక దారుఢ్యం ఎంతో అవసరం

అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక దారుఢ్యం ఎంతో అవసరమని తెలిపారు. నల్లచెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్ద రెండు జిమ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

ఈ సందర్భంగా డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ మాట్లాడుతూ, పోక్సో కేసుల బాధితులకు ఒకే చోట న్యాయ సహాయం, మానసిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018లో భరోసా కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారికి అవసరమైన సహాయం అందించడం భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సహకారంతో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ శారీరక దారుఢ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.

జిమ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, పోలీసులు, యువత జిమ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ​భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒకే వాతావరణంలో వైద్యం, చట్టపరమైన సహాయం, మానసిక కౌన్సెలింగ్ మరియు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు.

మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం

ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ భరోసా కేంద్రాలు పోక్సో, రేప్ కేసుల బాధితులకు మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతున్నాయన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఐజి చారు సిన్హా నేతృత్వంలో రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత పోలీసు శాఖ కల్పిస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా , యువజన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్‌లో పోలీస్ జట్టు విజేతగా నిలవగా, ఉపాధ్యాయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అనంతరం పోలీసు సిబ్బందికి నూతన క్యాప్స్‌ను పంపిణీ చేశారు. డీఎస్పీలు బాలాజీ నాయక్, గిరి ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి ఇతర అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>