త్వరలోనే అందుబాటులోకి భద్రాద్రి విమానాశ్రయం!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి జిల్లా వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరనుంది. సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యలతో భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు (Bhadradri Airport) ప్రాజెక్టు త్వరలోనే పట్టా లెక్కనుంది. విమానాశ్రయ నిర్మాణ స్థలాల సాధ్యాసాధ్యాల(ఫీజిబిలిటీ) నివేదిక తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ చేతికి అందింది.

గతంలో కొత్తగూడెం పరిసరాల్లో ప్రతిపాదిత రెండు స్థలాలతో ప్రాజెక్టుకు తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. ఒక స్థలం రన్‌వే నిర్మాణానికి సాంకేతికంగా సరిపోలేదు. మరొకటి భారీ భూసేకరణ వ్యయంతో ఆర్థికంగా ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. దీంతో కేంద్రం సూచనలతో ‘ రాజ్‌ టెక్నాలజీస్‌’ సాంకేతిక సంస్థను రంగంలోకి దించడంతో ప్రాజెక్టు మలుపుతిరిగింది. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూతల, రన్‌వే దిశ, ఎత్తు పరిమితులు, పర్యావరణ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. వివాదాలకు తావులేని విధంగా సరికొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

సర్వేలో అన్ని రకాల ప్రమాణాలకు అనుగుణంగా సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలమైనవిగా నిలిచాయి. ఏటీఆర్‌-72-600 రకం వాణిజ్య విమానాల రాకపోకలకు ఇవి ఎంతో అనువైనవని, ఎలాంటి పర్యావరణ లేదా అటవీ భూముల అడ్డంకులు లేకుండా సుమారు 667 ఎకరాల సువిశాల స్థలాన్ని ఇక్కడ సేకరించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఏళ్లుగా నానుతున్న స్థల నిర్ధారణ సమస్యకు శాశ్వతంగా తెరపడే అవకాశం ఉంది.

ఇటీవల ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రాంమోహన్‌ నాయుడును (Ram Mohan Naidu) రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసినప్పుడు.. కొత్త స్థలాలపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరింది. ఆ మేరకు నిర్దేశిత గడువులోనే మంత్రి తుమ్మల పూర్తి వివరాలతో కూడిన ఫీజిబిలిటీ నివేదికను కేంద్రానికి సమర్పించారు. స్థల నిర్ధారణ సమస్య దాదాపు కొలిక్కి రావడంతో కేంద్రం నుంచి తుది సాంకేతిక అనుమతులు లభించడమే మిగిలింది.

Read Also: సాగు మారింది.. పాలమూరు రైతుల సరికొత్త ‘పంట‘!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>