Mobile Popup Ad
Mobile Popup Ad

సాగు మారింది.. పాలమూరు రైతుల సరికొత్త ‘పంట‘!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వర్షాలు ఎప్పుడు వస్తాయో రావో తెలియదు.. పైగా, ఏటేటా తడిసిమోపడవుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయం సవాల్ గా మారుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సరికొత్త ఆలోచన చేస్తున్నారు. సొంత భూముల ద్వారా దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందే మార్గాలపై దృష్టి పెడుతున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఆ దిశగా ఇప్పటికే తమ పొలాల్లో సోలార్ పంటలు పండిస్తున్నారు. కొందరు భూములను లీజ్ కు ఇచ్చి.. మరికొందరు సొంతంగా ఈ సాగులో రాణిస్తున్నారు.

ఒక్క ఎకరాలో సొంతంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని.. నెలకు రూ. 30 వేల దాకా ఆదాయం పొందుతున్నారు. దానికి తోడు సోలార్ ప్యానళ్ల కింద.. టమాట, వంకాయ, బెండకాయ వంటి కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలో 600 మెగావాట్ల విద్యుత్ను కేవలం రైతులే ఉత్పత్తి చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. రైతుల ఆసక్తిని గమనించి పలు సంస్థలు ముందుకొచ్చి వారితో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఏడాదికి ఇంత ఇస్తామంటూ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతుల ‘సోలార్’ విజయగాథపై ‘కలం’ సండే స్పెషల్..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం

కేంద్ర ప్రభుత్వం పీఎం-కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్లు, సోలార్ పంపుల ఏర్పాటుకు సబ్సిడీలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు బంజరు భూములతో పాటు సాగు భూములను కూడా సోలార్ డెవలపర్లకు లీజుకు ఇచ్చి అదనపు ఆదాయం పొందుతున్నారు. సాంకేతికతను, సంప్రదాయ వ్యవసాయాన్ని సమన్వయం చేస్తూ రైతులు అన్నదాతలుగానే కాకుండా ఊర్జదాతలుగా కూడా మారుతున్నారు.

ముఖ్యంగా జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ (Mahabubnagar), వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఐదు నుంచి పది ఎకరాల భూములు కలిగిన రైతులు కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. గతంలో పెద్ద పారిశ్రామిక సంస్థలే భారీ స్థాయిలో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేవి. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా రైతులే స్వయంగా లేదా భాగస్వామ్య పద్ధతిలో సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 600 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారులు, ఆయా కంపెనీల ద్వారా తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతం సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో సోలార్ ఉత్పత్తి ఇలా..

కల్వకుర్తి మండలం ఎం.ఎం.పల్లి సమీపంలో జవేరి రిన్యూవబుల్స్, ఇన్ఫినిటీ గ్లోబల్ సంస్థలు సంయుక్తంగా 20 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. 2017లో 135 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అప్పట్లో యూనిట్‌కు రూ.6 చొప్పున 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఇదే మండలంలోని రాచూరులో అజూర్ సంస్థ సుమారు 400 ఎకరాల్లో 100 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పంజుగులలో ఆదిత్య బిర్లా గ్రూప్ 10 మెగావాట్లు, రాచూరు సమీపంలో పిజియన్ సోలార్ 5 మెగావాట్ల ప్లాంట్లను నిర్వహిస్తున్నాయి. మొత్తంగా కల్వకుర్తి ప్రాంతంలోనే సుమారు 135 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానమైంది.

మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా బాలానగర్ మండలం గుండేడు వద్ద 255 ఎకరాల్లో నెలకొల్పిన 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏసీఎంఈ సంస్థ నిర్వహిస్తోంది. నవాబ్‌పేట మండలం ఇప్పటూరులో 25 మెగావాట్లు, కారూరులో15 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అడ్డాకుల మండలం బలీదుపల్లి సమీపంలో షెల్ సంస్థ 100 మెగావాట్లు, రెన్యూ పవర్ సంస్థ మరో 100 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి.

సుమారు 900 ఎకరాల్లో విస్తరించిన ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వెల్టూరు గ్రిడ్‌కు అనుసంధానించారు. అచ్చంపేట ప్రాంతంలో సోలార్ పార్క్ సంస్థ 15 మెగావాట్లు, రుద్రా సోలార్ 10 మెగావాట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, మొత్తం 30 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

రైతులే పారిశ్రామికవేత్తలు

కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి ప్రాంతంలో ఏసీఎంఈ సంస్థ 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. మద్దూర్ మండలం దామగ్నాపూర్ గ్రామానికి చెందిన రైతు మహేశ్వర్ రెడ్డి తన 160 ఎకరాల భూమిలో 30 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. రైతులు స్వయంగా సౌర విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న తాజా ఉదాహరణగా ఇది నిలుస్తోంది.

మహిళా సంఘాలకూ అవకాశం

మహిళా సంఘాలను కూడా సౌర విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కొడంగల్‌లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో, మక్తల్ సమీపంలోని సత్యారం గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సుమారు 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

భవిష్యత్తు సోలార్‌దే..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు నుంచి పది ఎకరాల భూములు కలిగిన రైతులు కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. పీఎం-కుసుమ్ వంటి పథకాల కింద సబ్సిడీలు అందుబాటులో ఉండటంతో రానున్న రోజుల్లో మరింత మంది రైతులు ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని కూడా ఆదాయ వనరుగా మార్చుకుంటూ పాలమూరు రైతులు కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు.

సాంకేతిక అవగాహనతోనే విజయవంతం

రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మారుతున్న సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో సరైన అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ల్యాండ్ ఓనర్, సోలార్ ప్లాంట్ నిర్వాహకుడు సంగుబొట్ల రమేశ్ తెలిపారు. ఈర్లబండ సమీపంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ముగ్గురు భాగస్వాములతో కలిసి ఆయన సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. సోలార్‌ను కేవలం ఒక వ్యాపారంగా కాకుండా దీర్ఘకాలిక బాధ్యతగా చూడాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడు ఎకరాల భూమి ఉంటే ఒక మెగావాట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, దానికి బ్యాంకు రుణాలు పొందడం క్షేత్రస్థాయిలో అంత సులభం కాదని, దీని వెనుక ఎన్నో సాంకేతిక, ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కూలీల కొరతతో సోలార్ వైపు : వి. కృష్టారెడ్డి, బలాన్ పల్లి, తాడూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా

వ్యవసాయ సాగు చేద్దామంటే పనులకు కూలీల కొరత ఉంది. అందుకే సాగు మానేశాను. నాకు ఉన్న ఆరున్నర ఎకరాల్లో 7 కోట్ల ఖర్చుతో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సోలార్ ప్లాంటు నిర్మించాను. బ్యాంక్ లోన్ గా 85% శాతం రాగా, మిగతా డబ్బులను సొంతంగానే సమకూర్చుకున్నా. ఒక్క యూనిట్ రూ. 3.13 పైసలకు ప్రభుత్వానికి అమ్మేలా 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నా. రెండు మాసాల నుంచే ప్లాంట్ లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఐతోల్ విద్యుత్ సబ్ స్టేషన్ కు సరఫరా చేస్తున్నా.

3 మెగావాట్లతో ప్లాంటు నిర్మిస్తున్నా : లంకాల విజయ్ కుమార్ రెడ్డి, మాధారం, మిడ్జిల్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

కేంద్రం కుసుమ్ స్కీమ్ కింద సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రైతులకు అవకాశం ఉంది. నేను రూ 3.50 కోట్లు ఖర్చుపెట్టి సొంతూరిలో 9 ఎకరాల్లో 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నా. త్వరలోనే సోలార్ పవర్ లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

సోలార్ ఉత్పత్తిపై పెరిగిన ఆసక్తి : వినయ్, సైట్ మేనేజర్, జవేరి రీనబుల్స్ ఎంగంపల్లి, కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వాడడం పెరుగుతోంది. ఏటా రాష్ట్రంలో10 వేల మెగావాట్లు సోలార్ విద్యుత్ ద్వారానే సమకూరుతోంది. దేశంలో గుజరాత్ తర్వాత తెలంగాణనే అత్యధికంగా సోలార్ విద్యుత్ తయారు చేస్తోంది. ప్రస్తుతం ఒక్క యూనిట్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వంతో రూ. 3.13తో 25 ఏళ్లు ఒప్పందం చేసుకోవడం జరిగింది.

రైతులు 5,10 ,15 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీర్ఘకాలం లాభాలు అర్జించాలనుకునేవారికి సోలార్ పవర్ ప్రాజెక్ట్ మంచి అవకాశంగా ఉంది. ఏటా నవంబర్ నుంచి మే నెల మధ్యలో సోలార్ పవర్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సూర్య ఘర్ స్కీమ్ ద్వారా సోలార్ ప్లాంట్ ను బ్యాంకు రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై 12 సోలార్ ప్లేట్స్ ను అమర్చుకుంటే 3(కేవీ)కిలో వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>