కలం, నిర్మల్ : మామడ (Mamda) మండలం కొరిటికల్ గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు అపహరించిన దుండగులు, అనంతరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో గ్రామ భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ వీడీసీ (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు స్వచ్ఛందంగా రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. వంతుల వారీగా ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో తిరుగుతూ నిఘా ఉంచుతున్నారు. గస్తీ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల వివరాలు తెలుసుకుంటున్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు వీడీసీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల గ్రామస్తులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

