కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని న్యూజెర్సీ(New Jersey ) లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఓషన్ టౌన్‌షిప్‌లోని ప్రముఖ ‘బీజేస్’ (BJ’s) హోల్‌సేల్ క్లబ్ పై కప్పు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో కొనుగోలుదారుల మొబైల్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నీటి ఉధృతి.. భయంతో జనం పరుగులు
సోమవారం ఆ ప్రాంతంలో తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా స్టోర్ పైకప్పులోని ఒక భాగం ఒక్కసారిగా కిందకు కూలింది. పైకప్పు తెరుచుకోవడంతో నీరు ఉధృతంగా స్టోర్ లోపలికి దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే భవనం దద్దరిల్లడంతో, లోపల ఉన్న కస్టమర్లు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. హోల్‌సేల్ క్లబ్ లో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

