Mobile Popup Ad
Mobile Popup Ad

భట్టి లేట్.. జూపల్లి ఫాస్ట్.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

కలం, తెలంగాణ బ్యూరో: ‘‘చేసింది చెప్పుకోలేకపోతున్నాం.. ప్రతిపక్షాలు చేసే హైజాక్ కుట్రలను తిప్పికొట్టలేకపోతున్నాం..’’ ఇవీ తరచూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ (Congress) పెద్దల నుంచి వస్తున్న కామెంట్స్. ఇటీవల రాష్ట్ర సర్కార్ ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసింది. శిల్పకళావేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి విడుదలకు శ్రీకారం చుట్టారు. అంతలోనే ఉన్నట్టుండి రాష్ట్రంలో ‘అప్పుల’ ఇష్యూ తెరమీదికి వచ్చింది. నాలుగు రోజులు రచ్చ రచ్చ జరిగిపోయింది.

‘రైతు భరోసా’ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కకుండా చేయడానికే బీఆర్ఎస్ ఇలా ప్లాన్ చేసిందని, మంత్రుల మధ్య గ్యాప్ వారికి కలిసి వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్‌లో డిస్కషన్ కొనసాగుతున్నది. ఇందుకు ‘అప్పుల’పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందనలను ఆ వర్గాలు ఉదహరిస్తున్నాయి. అప్పులపై ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందుగా స్పందించాల్సి ఉన్నా.. ఆయన లేట్ అయ్యారని, కౌంటర్ లో వెనుకబడ్డారనే కామెంట్స్ వినిపించాయి.

అయితే పరిస్థితి చేయిదాటిపోతున్నదనే పరిస్థితుల్లో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల లెక్కల చిట్టా విప్పారు. దాదాపు మూడు రోజుల తర్వాత డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి అవే గణాంకాలను రిలీజ్ చేశారు. ఆ మూడోరోజు కూడా జూపల్లి కృష్ణారావు మొదట బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావుకు అప్పులపై లెక్కలతో లెటర్ రాసి, సాయంత్రం ప్రెస్ క్లబ్ లో చర్చకు వెయిటింగ్ అంటూ సవాల్ విసిరి అక్కడ కూర్చున్నారు. ఆ మధ్య గ్యాప్ లో భట్టి విక్రమార్క మీడియా ముందుకు వచ్చి లెక్కలు చెప్పారు. ఇలా ఇద్దరు మంత్రుల్లో అప్పులపై పక్కా లెక్కలు చెప్పాల్సిన భట్టి లేట్గా రియాక్ట్ కావడం, జూపల్లి దూకుడుగా ముందుకు వెళ్లడం గాంధీభవన్ వర్గాల్లో చర్చకు దారితీసింది. మంత్రుల మధ్య గ్యాప్ ఉన్నదనే ప్రత్యర్థుల ఆరోపణలకు ఇది మరోసారి బలం చేకూర్చినట్లయింది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం తరఫున అధికారిక వాయిస్ ఎవరనే సందేహాలు మొదలయ్యాయి.

ఎందుకు దూకుడుగా వెళ్లలేదు?

అప్పుల విషయంలో బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరు లెక్కలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు సకాలంలో స్పందించలేదు.. ప్రతిపక్షానికి గట్టిగా కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు.. కట్టడి చేయడంలో ఆయన ఎందుకు చొరవ తీసుకోలేదు.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చింది.. ఇలాంటి పలు రకాల చర్చలు కాంగ్రెస్‌లో జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థిక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసి అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ చేసిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. ఈసారి బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎందుకు తొందరగా కౌంటర్ ఇవ్వలేదనేది హాట్ టాపిక్ గా మారింది. గురుకుల టెండర్ల అంశంలో ఆయా శాఖల మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ స్పందించినప్పుడు.. అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి ఎందుకు ఆ తరహాలో చొరవ తీసుకోలేదు.. ఎందుకు దూకుడుగా వ్యవహరించలేదనేది ఇటు కాంగ్రెస్ పార్టీలో, అటు ప్రభుత్వంలో ప్రశ్నలను లేవనెత్తుతున్నది.

జూపల్లి దూకుడుతో సీన్ ఛేంజ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసే తీరులో మంత్రి జూపల్లి జోక్యం చేసుకుని.. “నేను చెప్పిన లెక్కలు అక్షారాలా సత్యం. నా లెక్కలు తప్పు అని నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ప్రెస్ క్లబ్‌లో చర్చకు డేట్, టైమ్ ఫిక్స్ చేశా..” అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ఓపెన్ లెటర్ రాశారు. లేఖల్లో పేర్కొన్నట్లుగానే ప్రెస్ క్లబ్‌కు వెళ్లారు. ఏయే పద్దుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో ఎంతెంత అప్పు చేసిందో వివరాలన్నీ వెల్లడించారు. ఈ లెక్కలన్నింటినీ ప్రభుత్వం తరఫున చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కదే అయినప్పటికీ… ఆ పాత్రను మంత్రి జూపల్లి కృష్ణారావు పోషించడం అధికార పార్టీలోనే ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి అధికారిక వివరణ ఇస్తారనుకున్నా చివరకు జూపల్లి దూకుడు తర్వాత ఆయన స్పందించారు.

కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా?

ప్రతిపక్షాలు ప్రతీ రోజు ఒక్కో అంశంపై ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. మంత్రులు దీన్ని గమనిస్తూ ఉన్నారు. గురుకుల టెండర్ల విషయంలో సంక్షేమ శాఖ మంత్రులు, యూరియా విషయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ అంశాల్లో మంత్రి సీతక్క.. ఇలా అందరూ ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు. కానీ, అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి ఆలస్యంగా స్పందించడం అనేక సందేహాలకు తావిచ్చినట్లయింది. ఒక దశలో మంత్రి జూపల్లి జోక్యం చేసుకుని ‘తెలంగాణ భవన్‌కే వస్తా..’ అంటూ బీఆర్ఎస్ లీడర్లకు సవాల్ విసిరారు. చివరికి ఆర్థిక శాఖతో సంబంధం లేకపోయినా మొత్తం వివరాలను సేకరించి కేటీఆర్, హరీశ్‌రావుకు కౌంటర్ ఇవ్వడంలో దూకుడుగా వ్యవహరించారు. కొన్ని శాఖల్లో సంబంధిత మంత్రులు ఎందుకు వేగంగా రియాక్ట్ కావడంలేదు.. వారికి బదులుగా ఇతర శాఖల మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది.. ఇలాంటివన్నీ ప్రభుత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిందన్న విమర్శలకు దారితీసింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>