కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా రైతాంగానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ద్వారా తోడ్పాటును అందించాలని కలెక్టర్ (Nizamabad Collector) ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేలా వాణిజ్యపరంగా అనుసంధానం ఏర్పరచాలని కోరారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (డీజీఎఫ్‌టీ), (ఏపీఈడీఏ) జాతీయ పసుపు బోర్డు, నాబార్డు, ఇండియా పోస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు.
ఎగుమతులు పెంచుకోవాలి
నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జిల్లాల స్థాయిలో ఎగుమతులను గణనీయంగా పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ-కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, పసుపు, వరి, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి తదితర పంటల మార్కెట్ వైవిద్యీకరణ అంశాలపై డీజీఎఫ్‌టీ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన, అధిక దిగుబడులను అందించే పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, పంట ఉత్పత్తుల మార్కెటింగ్, విదేశాలకు ఎగుమతులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, సాగు నీటి యాజమాన్య పద్ధతులు తదితర అంశాల గురించి వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
సేద్యంలో ఆధునిక విధానాలు
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా రైతాంగం సేద్యపు రంగంలో ఆధునిక విధానాలు, శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ ఆదర్శ రైతులుగా పేరు పొందారని అన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత రైతులు అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తారని, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన వంగడాల విషయంలో అంకాపూర్ ప్రాంత రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. పురాతన, సంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక సాగు విధానాలను తెలియజేయడం, కూలీల కొరతను అధిగమించేందుకు వీలుగా యంత్రీకరణను వినియోగించడం, మార్కెటింగ్ మెలకువలు, పసుపు పంట నాణ్యతను పెంపొందించే ప్రాసెసింగ్ విధానాలపై తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు.
ఈ దిశగా నిజామాబాద్ జిల్లాను ఎగుమతి కేంద్రంగా ప్రకటిస్తూ, పసుపు, వరి రైతులకు అవగాహన పెంపొందించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించడం ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేకూరుస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. డీజీఎఫ్‌టీ ప్రాంతీయ సంచాలకులు ఎస్ఎ చవాన్ మాట్లాడుతూ, రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. అప్పుడే వారికి గణనీయమైన లాభాలు సమకూరడంతోపాటు విదేశీ మారకద్రవ్యం పెరిగి రూపాయి మారకం బలపడుతుందని, ఇది ఒక రకంగా దేశానికి సేవ చేసినట్లు అవుతుందని సూచించారు.
ప్రస్తుతం తెలంగాణ నుండి ఔషధాలు, ఇంజినీరింగ్ విడి భాగాలు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి జరుగుతున్నాయని, ఇదే కోవలో పసుపు, వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా అధిక మొత్తంలో ఎగుమతి చేయవచ్చని అన్నారు. ఫారిన్ ట్రేడ్ పాలసీని అనుసరిస్తూ విదేశీ ఎగుమతులకు ప్రభుత్వం తగిన రాయితీలు వర్తింపజేస్తూ, అనేక విధాలుగా ప్రోత్సహిస్తోందని అన్నారు.
ఈ కామర్స్ ప్రాధాన్యత గుర్తించాలి
నేటి పరిస్థితుల్లో ఈ-కామర్స్ ప్రాధాన్యతను గుర్తెరిగి, అవగాహనను పెంపొందించుకోవాలని, తద్వారా తాము ఉంటున్న ప్రాంతం నుండే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తుల ఎగుమతులు, వ్యాపార లావాదేవీలు జరపవచ్చని సూచించారు. డీజీఎఫ్‌టీ ద్వారా జిల్లా రైతాంగానికి తగిన తోడ్పాటు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు అధికారులు కేవీఎస్ శైలజ, ప్రత్యూష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు విద్య, కే జనార్ధన్ రెడ్డి, ఏపీఈడీఏ అధికారి నాయుడు, నాబార్డు డీజీఎం ఎస్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.

