కలం, వెబ్‌డెస్క్: రైలు (Train) ప్రయాణం చేసేటప్పుడు సొంత ఊరి నుండి నెయ్యి (Ghee), నూనెలు (Oils), లేదా పచ్చళ్లు (Pickles) వంటి గృహ అవసరాల వస్తువులను ప్యాక్ చేసుకుని తీసుకెళ్లడం మన దేశంలో చాలా సాధారణం. అయితే, భారతీయ రైల్వే (Indian Railway) నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణించేటప్పుడు ఇలాంటి ద్రవ పదార్థాలను, ముఖ్యంగా నెయ్యిని తీసుకెళ్లడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయనే విషయం చాలా మంది ప్రయాణికులకు తెలియదు.
సాధారణంగా రైళ్లలో ప్రయాణించే వారికి లగేజీ నిబంధనలు ఎంతో కీలకమైనవి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కఠినమైన నియమ నిబంధనలు అమలు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ నియమ నిబంధనలు సరిగ్గా తెలియకుండా ప్రయాణిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి రైల్వే శాఖలో ఈ ప్రత్యేక నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
రైల్వే చట్టం ప్రకారం.. ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం గరిష్టంగా 20 కిలోల వరకు నెయ్యిని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ దానికోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటంటే.. ప్లాస్టిక్ కవర్లు, లీక్ అయ్యే మూతలు ఉన్న డబ్బాల్లో నెయ్యిని తీసుకెళ్లడానికి అనుమతించరు. మీరు తీసుకెళ్లే నెయ్యి లేదా ఇతర ద్రవ పదార్థాలు కచ్చితంగా ‘లీక్ ప్రూఫ్’ ప్యాకేజింగ్‌లో ఉండాలి. ఒకవేళ మీ నిర్లక్ష్యం కారణంగా నెయ్యి లీకై, తోటి ప్రయాణికుల సామగ్రి పాడైతే మీపై కఠిన చర్యలు తీసుకుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి టిన్లు, నూనె డబ్బాలను ప్యాసింజర్ కోచ్‌లలో లగేజీగా తరలించడం పూర్తిగా నిషిద్ధమని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లాల్సి వస్తే, దాన్ని ముందే లగేజీ వ్యాన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. అలాగే పేలుడు పదార్థాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, ప్రమాదకరమైన రసాయనాలు, పొడి ఆకులు, చనిపోయిన కోళ్లు వంటి వస్తువులను కూడా రైళ్లలో తీసుకెళ్లడంపై నిషేధం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు.

