కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని నిజామాబాద్ (Nizamabad) బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి పటేల్ (Dinesh Kulachari) డిమాండ్ చేశారు. వడగళ్ల వర్షంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో సుమారు 500 ఎకరాలకు పైగా దెబ్బ తిన్న పంటలను దినేష్ కులాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నష్టపోయిన ఒక్కో ఎకరాకు ప్రభుత్వం 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రైతన్న ఆరుగాలం పండించిన పంట అకాల వర్షంతో నేలమట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాన్ని రైతులకు వర్తింపజేయాలన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులతో అంచనా వేసి నష్ట పరిహారం అందించాలని ఆయన (Dinesh Kulachari) డిమాండ్ చేశారు. ధర్పల్లి మండలం రామడుగు, ఇతర గ్రామాల్లో కూడా వరి పంట భారీగా నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ డిచ్ పల్లి మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, యానంపల్లి సర్పంచ్ భాస్కర్, సర్పంచ్ లు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చౌకి లక్ష్మణ్ రమణ, రవి నాయక్ , పరుశురాం, సుద్ధపల్లి సాంపల్లి, సుద్దపల్లి తండా,సాంపల్లి తండా వివిధ గ్రామస్తుల రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: ప్రేమ వివాహాలపై కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కఠినం, కర్ణాటకలో స్వేచ్ఛ!
Follow Us On : WhatsApp

