కేరళ(Kerala) రాష్ట్రం అరుదైన ఘనత సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము పేదరికాన్ని నిర్మూలించగలిగామని చెప్పారు. కేరళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయన్ ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆయన ప్రకటనను కొట్టిపారేస్తున్నాయి. తప్పుడు నివేదికలు, వివరాల ఆధారంగా విజయ్ మాట్లాడుతున్నారన్నది వారి ఆరోపణ.
దారిద్య్ర రహిత రాష్ట్రంగా Kerala
కేరళ దారిద్య్ర రహిత రాష్ట్రంగా అవతరించినట్లు విజయన్ చెప్పుకొచ్చారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రం కేరళ అని ఆయన పేర్కొన్నారు. “ప్రతీ పౌరుడికి నివాసం, విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పించాం. రేషన్‌కార్డులు, పెన్షన్‌లు కల్పించాం.’ అని ఆయన పేర్కొన్నారు. కేరళలో పేదరికం 0.55 మాత్రమేనని నీతి అయోగ్ నివేదిక స్పష్టం చేసిందని పినరయ్ విజయన్ అంటున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ పేదరికం లేదని ఆయన చెబుతున్నారు.
విపక్షాల అభ్యంతరం ఏమిటి?
అయితే కేరళను “దారిద్య్ర రహిత రాష్ట్రం” అని ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ ప్రకటన ప్రజలను మోసం చేయడమేనని వారు అంటున్నారు. స్థానిక సంస్థల్లో పేదరిక నిర్మూలన వివరాలు వాస్తవానికి అనుగుణంగా లేవని, ఇంకా అనేక వర్గాలు పేదరికంలోనే ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. ఎక్స్ ట్రీమ్ పవర్టీ అనే దానికి సరైన నిర్వచనం లేదని.. ప్రభుత్వం చెబుతున్న డేటా మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. షెడ్యూల్ కులాలు, మత్స్యకారులు, వృద్ధులు, అనాధలు వంటి వర్గాలు ఇంకా వెనకబడి ఉన్నాయని వారు అంటున్నారు.
ప్రచార ఆర్భాటం అంటున్న విపక్షాలు
పినరయి విజయన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను ప్రతిపక్షాలు “ప్రచార ఆర్భాటం ” అని విమర్శిస్తున్నాయి. “ప్రజాదరణ పొందేందుకు ప్రభుత్వమే సంఖ్యలను తక్కువ చూపుతోంది” అంటూ కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వం మాత్రం “ఈ ప్రకటన ప్రచారం కోసం కాదు, కేరళ ప్రజల సమిష్టి కృషికి ప్రతీక” అని స్పష్టం చేసింది. అయితే నీతి అయోగ్ చెప్పిన వివరాల ఆధారంగా కేరళ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినప్పటికీ రాష్ట్రంలో నిజంగానే పేదరికం తగ్గిందా? గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, ఇతర అణగారిన వర్గాలు నిజంగానే పేదరికం నుంచి బయటపడ్డారా? అన్న విషయం మీద మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇతర రాష్ట్రాల కంటే కేరళ కొంత మేర పేదరికాన్ని తగ్గించుకోవడం అభినందించదగ్గ విషయమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: బీహార్ ప్రజలకు సీఎం నితీశ్ కుమార్ వీడియో సందేశం
Follow Us On : Instagram

