కలం, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఈదురు గాలుల కారణంగా రైల్వే సేవల్లో అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్ పాసింజర్ రైలు (Narsapur Passenger Train)కు పెద్ద ప్రమాదం తప్పిన ఘటన చెరుకువాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈదురు గాలుల తీవ్రతతో అక్కడి చెరుకువాడ ప్రాంతంలో తాటాకు రైల్వే విద్యుత్ తీగలపై పడింది. దీంతో తీగల్లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో నర్సాపూర్ పాసింజర్ రైలు అదే మార్గంలో వస్తుండటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును సమయానికి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో ఆకివీడు–కైకలూరు మధ్య మరో ఘటన జరిగింది. అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ లోపం (ఫెయిల్) కావడంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్, పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. విద్యుత్‌శాఖ, రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు. అనంతరం రైళ్ల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ఘటనలతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: యాదాద్రి–వరంగల్ హైవే ప్రైవేట్ పరం: కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp

