కలం, వరంగల్ బ్యూరో : వడ్ల కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అబద్ధాలు మాట్లాడటం సరికాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. శనివారం ఖిలా వరంగల్‌లో జరుగుతున్న బీజేపీ శిక్షణా తరగతులకు హాజరైన ఆయన, ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సరైన అవగాహన లేకుండా నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రం పారదర్శకంగా పనిచేస్తోందని, దేశ ప్రజల ఆశీస్సులు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్నాయని పేర్కొన్నారు. మోదీ హయాంలో రైతులకు మద్దతు ధర పెంచడంతో పాటు పంటల కొనుగోలు సజావుగా జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చకు తాము సిద్ధమని, ప్రభుత్వం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అలాగే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కూడా విమర్శలు చేశారు. కేటీఆర్ గతంలో ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

