కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశం మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన శనివారం జరిగింది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి డివిజన్‌లోనూ ప్రజల అవసరాలను గుర్తించి ముందుకు సాగాలన్నారు. నగర పరిధిలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమస్య తీవ్రంగా ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగు నీటి పథకం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇది పూర్తయితే కార్పొరేషన్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
అదనపు సిబ్బందిని నియమిస్తాం..
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత వేధిస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి అదనపు సిబ్బందిని పెంచేలా చూస్తామన్నారు. విద్యుత్తు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల డ్రైన్లు తదితర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చూపుతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్పొరేషన్ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

