కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని వరంగల్ (Warangal) ఎంపీ కడియం కావ్య (MP Kadiyam Kavya) అన్నారు. మంగళవారం రఘునాథపల్లిలో డీసీసీబీ నూతన బ్రాంచ్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari)తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు, మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడేందుకు ఇటువంటి బ్యాంకింగ్ సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రఘునాథపల్లిలో బ్యాంకు బ్రాంచ్ ప్రారంభం కావడం సంతోషకరమని, స్థానికులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ భూమిని ఆధారంగా చేసుకుని విద్యా రుణాలు అందించడం అభినందనీయమని అన్నారు. బంగారు రుణాల రూపంలో ఇప్పటికే రూ.541 కోట్ల వరకు సహాయం అందించడాన్ని ప్రస్తావిస్తూ, సహకార బ్యాంకులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని చెప్పారు. బ్యాంకు సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత పురోగతి సాధించాలని కోరారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ డీసీసీబీ ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థగా ప్రజాసేవలో, ముఖ్యంగా రైతు సేవలో ముందంజలో ఉండడం సంతోషకరమని తెలిపారు. నాబార్డ్ సహకారంతో డీసీసీబీ బ్యాంకులు మరింత బలోపేతం అవుతున్నాయని అన్నారు. ప్రతి మండలంలో ఇలాంటి బ్యాంకు ఉంటే ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంటుందని, ఈ సేవలు మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అవసరమైతే వరంగల్ డీసీసీబీ బ్రాంచ్‌ల పెంపుపై ఎంపీ కడియం కావ్య సహకారంతో ఆర్బీఐతో చర్చించి మరిన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రుణాల మంజూరు విషయంలో డీసీసీబీ ప్రథమ స్థానంలో నిలుస్తోందని, రైతులు, మహిళా సంఘాలు రుణాలను క్రమం తప్పకుండా చెల్లించినప్పుడే బ్యాంకులకు మంచి పేరు వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు సీఈవో వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎమ్ చంద్రశేఖర్, చైతన్య రవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, సర్పంచ్ ఉమారాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Follow Us On : WhatsApp

