Mobile Popup Ad
Mobile Popup Ad

బ్యాంకా లేక బారా? : మోత్కూరు PACSలో సిబ్బంది తీరు

కలం, నల్లగొండ బ్యూరో : రైతులకు అండగా ఉండాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. పగలు రైతుల సమస్యలతో రద్దీగా ఉండాల్సిన బ్యాంకు, అర్ధరాత్రి పూట మందు బాబుల విందులకు వేదికవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పీఏసీఎస్ (Motkur PACS) బ్యాంకులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఉదంతం సహకార వ్యవస్థలోని లోపాలను, ఉద్యోగుల బరితెగింపును ఎండగడుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా బ్యాంకు చైర్మన్ ఛాంబర్‌లోనే ఈ మద్యం విందు జరగడం గమనార్హం. అర్ధరాత్రి వేళ బ్యాంకు ఉద్యోగులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి విందు జరుపుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. నిబంధనల ప్రకారం సాయంత్రం వేళ మూతపడాల్సిన బ్యాంకు.. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడం వెనుక ఉన్న అసలు కారణం మద్యం విందులేనని స్పష్టమవుతోంది.

రుణాల వెనుక లంచాల మర్మం..

ఈ విందులు కేవలం వినోదం కోసమే కాదని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. సామాన్య రైతు లోన్ కోసం వస్తే నెలల తరబడి తిప్పించుకునే ఉద్యోగులు, దళారులకు మాత్రం అర్ధరాత్రి పూట లోన్లు మంజూరు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారుల వద్ద పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని, అర్హత లేని వారికి కూడా నిబంధనలకు విరుద్ధంగా రుణాలు కట్టబెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు నిధులను సామాన్య రైతులకు చేరకుండా.. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సహకార సంఘాలు రైతులకు వెన్నుముకగా ఉండాలి. కానీ మోత్కూరు పీఏసీఎస్‌లో (Motkur PACS) జరుగుతున్న పరిణామాలు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఏకంగా బ్యాంకులోనే మద్యం సేవించడం అనేది కేవలం క్రమశిక్షణా రాహిత్యం మాత్రమే కాదు. అది రైతుల నమ్మకాన్ని వమ్ము చేయడమే. బ్యాంకు తాళాలు, చైర్మన్ ఛాంబర్ యాక్సెస్ ఉన్న వ్యక్తులే ఇలాంటి పనులకు పాల్పడటం వెనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. బాధ్యులైన ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని, అర్ధరాత్రి వేళ మంజూరు చేసిన లోన్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు రికార్డులను సీజ్ చేసి, అవినీతి అక్రమాలను బయట పెట్టాలనే వాదన విన్పిస్తోంది. అన్నదాతకు అండగా ఉండాల్సిన సహకార సంఘం, అవినీతి తిమింగలాలకు అడ్డాగా మారడం దురదృష్టకరం. ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, సహకార వ్యవస్థపై రైతులకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉంది.

Read Also: చక్కెర వాడకండి.. కరీంనగర్ వైద్యుడి భావోద్వేగం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>