కలం, ఖమ్మం బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు, బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై చేసిన అఘాయిత్యం ఒక అనాగరిక సమాజాన్ని తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (Tata Madhusudan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసును కప్పిపుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
”నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. మైనర్ బాలిక అని తెలిసినా బండి సంజయ్, కుమారుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైనప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, వారిపైనే తిరిగి కేసులు పెట్టడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం” అని మండిపడ్డారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, తన అధికారాన్ని ఉపయోగించి చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. భారతీయ విలువలు, సంస్కృతి గురించి మాట్లాడే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి, లేదంటే ఆయన స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని మధు డిమాండ్ చేశారు.
బలహీన వర్గానికి చెందిన ఆ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నిందితుడు ఎంతటి వాడైనా చట్టం ముందు సమానమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే భగీరథ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తాతా మధు కోరారు.
బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

