కలం, స్పోర్ట్స్ : వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన లేదని ఐసీసీ (ICC) స్పష్టం చేసింది. అయితే ఇకపై కారణం లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే విధానానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా తెలిపారు. వన్డే ఫార్మాట్‌కు భవిష్యత్ ఉందని ఆయన చెప్పారు. పురుషుల, మహిళల ప్రపంచకప్‌లతో వన్డేలను బలంగా అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెట్‌కు అభిమానుల ఆసక్తి పెరగాలంటే సందర్భం, సంస్కృతి, పోటీ, పోటీతత్వం కీలకమని గుప్తా పేర్కొన్నారు. వన్డేలను కూడా ఈ అంశాల ఆధారంగా మరింత ఆకర్షణీయంగా మార్చాల్సి ఉందన్నారు.
వన్డే క్రికెట్‌కు ప్రత్యేక సమయం కేటాయించే అంశంపై ఐసీసీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రపంచకప్‌కు ముందు వన్డేలకు ప్రత్యేక విండో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నా.. టెస్ట్ క్రికెట్ విలువ తగ్గకూడదని గుప్తా చెప్పారు. టెస్టులకు సంప్రదాయం, ప్రతిష్ఠ, చరిత్ర ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఇవి మాత్రమే సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త తరం అభిమానులకు టెస్ట్ క్రికెట్ అనుభవం ఆకట్టుకునేలా ఉండాలని చెప్పారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టెస్టులకు మరింత అర్థం, పోటీని తీసుకొచ్చిందని గుప్తా పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం లేని ఈ ఫైనల్ ఇప్పుడు కీలక ఈవెంట్‌గా మారిందన్నారు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వెలుపల టెస్ట్ క్రికెట్‌ను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని గుప్తా చెప్పారు. టెస్టులకు సరైన షెడ్యూల్ ఉండాలి. తగిన ప్రచారం, మార్కెటింగ్ కూడా అవసరమన్నారు. రెండు జట్ల మధ్య పోటీ స్థాయి, పిచ్ పరిస్థితులు కూడా ఆసక్తికరంగా ఉండాలని తెలిపారు.
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసేలా టెస్ట్ మ్యాచ్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్ ప్రపంచ క్రికెట్ వృద్ధికి ప్రధాన సాధనంగా ఉన్నా, వన్డేలు, టెస్టుల విలువను పెంచడంపైనా ఐసీసీ దృష్టి కొనసాగుతుందని గుప్తా స్పష్టం చేశారు.

