Mobile Popup Ad
Mobile Popup Ad

యువత భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్‌లోని (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఐడీఓసీ హాల్‌లో శనివారం జరిగిన 99 రోజుల  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఒక తరం బాగుండాలని మేము ఆలోచిస్తున్నప్పుడు, ఒక కుటుంబం మాత్రం తమ కుటుంబం మాత్రమే బాగుండాలని ఆలోచిస్తోంది” అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

మెగా జాబ్ మేళా ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లు  అందజేయడంతో పాటు, వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన విజేతలకు మెడల్స్, ప్రశంస పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లుగా అభివృద్ధి చేయడం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. అలాగే డిగ్రీ కాలేజీలలో జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభించి ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని చెప్పారు.

విద్యా రంగంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్ విజన్‌లో భాగంగా “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా “భారత్ ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఫార్మా, రీసెర్చ్ & ఇన్నోవేషన్ రంగాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డివైఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ ఎంపి ప్రవీణ్ కుమార్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>