కలం, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. తన పేరును వాడుకుంటూ నకిలీ ఖాతాల ద్వారా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తన పేరిట నకిలీ ఐడీలు నిర్వహిస్తున్నారని, ఆ ఐడీలకు సంబంధించిన వివరాలు పోలీసులకు అందజేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎలాంటి అధికారిక ఖాతాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం ఎక్స్ అకౌంట్ మాత్రమే వాడతానని, అది కూడా వెరిఫైడ్ హ్యాండిల్ (@TigerRajaSingh) ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటానని వెల్లడించారు. తన వెరిఫైడ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయని ఏ విషయాన్ని అయినా అధికారికంగా పరిగణించవద్దని ఆయన అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు.

