కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka) లోని ఐటీసీ పిఎస్పిడి కర్మాగారం ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన ఆదివారం ముగిసింది. సుమారు 15 గంటల పాటు కొనసాగిన ఈ ధర్నాపై సమాచారం అందుకున్న డీఎస్పీ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఐటీసీ యాజమాన్యం, కార్మిక సంఘ నాయకులు, బాధితులతో చర్చలు జరిపారు. పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య సమస్య సామరస్యంగా పరిష్కారమైంది.
బాధిత కుటుంబానికి ఐటీసీ యాజమాన్యం రూ.15 లక్షల ఆర్థిక పరిహారం చెల్లించడంతో పాటు, మృతుడి కుటుంబంలో ఒకరికి క్యాజువల్ లేబర్ ఉద్యోగం కల్పించేందుకు అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒప్పందం కుదరడంతో బాధితులు ధర్నా విరమించారు. అనంతరం పోలీసులు, బంధువులు కలిసి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం మృతుడి స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా పెద్దతండాకు తరలించారు.
ఘటన నేపథ్యం!
మహబూబాబాద్ జిల్లా పెద్దతండాకు చెందిన గుగులోత్ శ్రీరామ్ (47) సారపాక ఐటీసీ కర్మాగారంలో వెల్డర్‌గా (కాంట్రాక్ట్ కార్మికుడు) విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరుగుపయనమైన సమయంలో అతివేగంగా వచ్చిన ఒక లారీ ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో శ్రీరామ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహంతో ఐటీసీ ప్రధాన గేటు వద్ద టెంటు వేసి ధర్నాకు దిగారు. గతంలో ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు అందించిన రీతిలోనే తమకు కూడా తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక యూనియన్ నాయకులు, డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఐటీసీ యాజమాన్యం పరిహారానికి అంగీకరించడంతో ఉద్రిక్తత సమసిపోయింది.

