కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్ (Jharkhand)లో పరీక్షల నిర్వహణలో అక్రమాలపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. అజితా భట్టాచార్య, అనిమా హన్స్‌దా, జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేస్తూ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్‌కు లేఖలు పంపించారు. వీటికి గవర్నర్ ఆమోదం తెలిపినట్లు లోక్ భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది.
98 శాతం డిమాండ్లకు ఓకే..
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో విద్యార్థులు లేవనెత్తుతున్న డిమాండ్లలో 98 శాతం నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సుదివ్య కుమార్ సోనూ తెలిపారు. జేపీఎస్సీ బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్‌లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోందన్నారు. అంతేగాకుండా, ఆర్థిక వ్యవహారాల కోణంలో ఈడీ కూడా కేసు నమోదు చేసిందన్నారు. 90 రోజుల్లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసి, కుట్రదారులను జైలు పాలు చేస్తామన్నారు.
అయితే, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లుగా సీజీఎల్ పరీక్ష రద్దుకు మాత్రం ప్రభుత్వం అంగీకరించబోదన్నారు. ఎందుకంటే సుప్రీం కోర్టు, హైకోర్టుల పర్యవేక్షణలోనే పరీక్ష అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. విద్యార్థులకు ఇంకా అనుమానాలుంటే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చినా.. విద్యార్థులు ఒప్పుకోవడం లేదన్నారు. వారితో చర్చలు జరుగుతూనే ఉన్నట్లు వెల్లడించారు.

