కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఎడమ కాలువ కింద ఖరీఫ్ వరి సాగు కోసం ప్రభుత్వం తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు నోముల భగత్ కుమార్(Nomula Bhagath) డిమాండ్ చేశారు. జలాశయం నిండుతున్నప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయబోమని రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం వరుణ యాగాలు నిర్వహిస్తూ, మరోవైపు నిండుకుండలా ఉన్న నాగార్జునసాగర్ నీటిని రైతులకు విడుదల చేయకపోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించి, ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని నారుమడులు ఎండిపోకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సాగునీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేసే వరకు రైతుల తరఫున క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని నోముల భగత్ కుమార్ హెచ్చరించారు.

