తుంగతుర్తి కాంగ్రెస్‌ పంచాయితీ.. ఆ రిపోర్ట్‌తో PCCకి కొత్త తలనొప్పి!

కలం, తెలంగాణ బ్యూరో: తుంగతుర్తి (Thungathurthy) కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ముగ్గురు నాయకుల వ్యక్తిగత వివాదాన్ని దాటి, పార్టీ సామాజిక సమీకరణాలు, ఎన్నికల వ్యూహం, సంస్థాగత క్రమశిక్షణను పరీక్షించే స్థాయికి చేరుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి పీసీసీకి సీల్డ్ కవర్‌లో నివేదిక అందజేసింది. ఈ నివేదిక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారింది. రిపోర్ట్‌ను బహిర్గతం చేస్తే రెండు సామాజికవర్గాల మధ్య భేదాభిప్రాయాలకు దారితీస్తుందనే ఉద్దేశంతో ఎప్పటికీ గోప్యంగానే ఉంచేస్తారేమోనన్న మాటలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పుపడితే మాదిగ సామాజికవర్గం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుందని.. ఆయనకు క్లీన్‌చీట్ ఇస్తే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని తప్పుపట్టినట్లవుతుందని, ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ‘రెడ్డి’ ఓటర్లపై ప్రభావం చూపుతుందని లీడర్లు అనుకుంటున్నారు. దీంతో ఈ సమస్యను కొలిక్కి తేవడం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు సవాల్‌గా మారింది.

ఏ నిర్ణయం తీసుకున్నా తిప్పలే..!

తుంగతుర్తి వ్యవహారం పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రాజకీయంగా సున్నితమైన సామాజిక సమీకరణాల అంశం. తుంగతుర్తి విషయంలో పీసీసీ తీసుకునే నిర్ణయం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలనే ప్రభావితం చేస్తుంది. ఒకవైపు తుంగతుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేలు మాదిగ సామాజికవర్గానికి చెందిన నాయకుడు.. మరోవైపు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన ప్రభావవంతమైన నాయకులు. దీంతో ఈ వివాదంలో పార్టీ ఎటువైపు నిర్ణయం తీసుకున్నా మరోవైపు అసంతృప్తి తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇంకోవైపు ‘నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేనే సుప్రీం’ అనే పాలసీ కూడా ఈ కేసులో కీలక అంశంగా మారింది. ఆ పాలసీ ప్రకారం తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేలు అభిప్రాయానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ‘ఎమ్మెల్యే అధికారాన్ని పార్టీ కాపాడింది’ అనే సందేశం వెళ్తుంది. ఇది పరోక్షంగా ఎంపీ, మునుగోడు ఎమ్మెల్యేపై పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లవుతుందనే కామెంట్స్ వస్తాయన్నది పార్టీ నేతల భావన.

ఒక్క సెగ్మెంట్ సమస్యే కాదు

సీల్డ్ కవర్ నివేదికలో కమిటీ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనేది ఆసక్తికరంగా మారింది. అటు ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టినా, ఇటు ‘రెడ్డి’ నేతలను తప్పుపట్టినా పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశముంది. ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రం మొత్తంమీద ప్రభావం చూపుతుందనే అభిప్రాయమూ నేతల్లో నెలకొన్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ‘దళితుల, ఆదివాసీ-గిరిజనుల పార్టీ’ అనే ముద్ర ఉన్నది. రాష్ట్రంలో ‘రెడ్డి’ పార్టీ అనే అభిప్రాయమూ ఉన్నది. ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణకు, చొరవ తీసుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి మాదిగ సామాజికవర్గంలో అభిమానమున్న పరిస్థితుల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే విషయంలో పార్టీ నాయకత్వం నెగెటివ్ నిర్ణయం తీసుకుంటే అది పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందనే భావన నెలకొన్నది. మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై పార్టీ చర్యలు తీసుకుందనే సంకేతం భవిష్యత్తులో పార్టీని డ్యామేజ్ చేస్తుందనే మాటలూ వినిపిస్తున్నాయి. తుంగతుర్తి అంశాన్ని రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణగా కాకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన అంశంగా చూడాలన్నది మెజారిటీ నేతల అభిప్రాయం.

బలమైన మెసేజ్‌గా ఉండాలి!

  • తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న సమస్య, దానిపై పార్టీ తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మరోసారి తలెత్తకుండా ఉండాలన్నది సీనియర్ నేతల వాదన. రెండు వైరి పక్షాల్లో ఏ ఒక్కదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా మరో పక్షానికి అసంతృప్తి కలిగిస్తుందని, ఇలాంటి పరిస్థితికి తావులేకుండా జాగ్రత్తగా పరిష్కరించడం కీలకమైన అంశమన్నది వారి సూచన.
  • ముగ్గురు నాయకులనూ పిలిచి మందలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించి వ్యవహారాన్ని ముగిస్తే ఒకరికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించారనే విమర్శకు ఆస్కారం లేకుండా చేయొచ్చని సీనియర్ నేతలు సూచించారు.
  • నివేదికను ఎప్పటికీ గోప్యంగానే ఉంచి క్రమశిక్షణా చర్యలేవీ తీసుకోకుండా రాజీ ఫార్ములాతో క్లోజ్ చేయడం మరో మార్గమని వారు అంటున్నారు. ఇందుకు గతంలో పార్టీ అనుసరించిన ఇలాంటి విధానాన్ని గుర్తుచేశారు.
  • జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బాధ్యతల పునర్వ్యవస్థీకరణ, సమన్వయ వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యక్తుల కంటే సంస్థ ప్రయోజనాలే ముఖ్యమనే తీరులో ముగించడం ఉత్తమ పరిష్కారంగా ఉంటుందని సీనియర్ నేతలు పేర్కొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>