కలం, తెలంగాణ బ్యూరో: నిన్నమొన్నటి వరకు పొలం పనుల్లో గడిపిన చేతులు.. ఇప్పుడు హైదరాబాద్లో సెక్యూరిటీ గేట్ల ముందు సెల్యూట్ కొడుతున్నాయి. పచ్చని పంటల నడుమ తలెత్తుకొని బతికిన కుటుంబాలు.. ఇప్పుడు నగరం నడిబొడ్డున ‘జీ హుజూర్’ అంటూ తలవంచుతున్నాయి. కాలం అయితే, వానపడితే చేతినిండా పని దొరుకుతుందని ఎదురుచూసిన పల్లె వాసులు వాన జాడ లేక సాగు పనులు ఆగిపోవడంతో పొట్ట చేత పట్టుకొని పట్నం బాట పడుతున్నారు. ఎల్ నినో ప్రభావం వాతావరణాన్ని మాత్రమేకాక పల్లె పేద కుటుంబాల బతుకులనూ కుదిపేస్తున్నది. గ్రామాల్లోని సొంతిండ్లను వదిలి.. నెల జీతం కోసం వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ నగరానికి ఆ కుటుంబాలు చేరుకుంటున్నాయి. నగరంలో ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషలు తెలియక, అనుభవం లేని పనులు కావడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాయి.
ఇలా ఒకరా ఇద్దరా.. వందల మంది పేద రైతులు, కూలీలు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలను విడిచి.. హైదరాబాద్ లోని షాపింగ్ మాల్స్ లో హౌస్ కీపింగ్, ప్రైవేటు ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు రావొద్దని వారిని బంధువులకు అప్పజెప్పి ఇంటి దగ్గరే ఉంచారు. నగరంలో వచ్చే అరకొర జీతంలో సగం ఇంటి కిరాయికి పోను.. మిగతాదాంట్లో దంపతులు కలోగంజో తాగి, మిగిలిన డబ్బులను పిల్లల కోసం దాస్తున్నారు. ఒక్క భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం నుంచే కాదు.. చాలా ప్రాంతాల నుంచి పల్లె కూలీలు పట్నం బాటపడుతున్నారు.
ఎల్ నినో ప్రభావం పల్లె జీవితాలను ఆగం చేస్తున్నది. పుట్టిపెరిగిన ఊరిలో వ్యవసాయ పనులు లేక చాలా మంది హైదరాబాద్కు తరలుతున్నారు. పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్, శేర్లింగపల్లి, ఉప్పల్ తదితర ఏరియాల్లోని ఇండస్ట్రీల్లో సెక్యూరిటీ గార్డులుగా, ఆఫీసులలో అటెండర్లుగా పనులు చేస్తున్నారు. వీరిలో చాలా మంది గతంలో ఎన్నడూ హైదరాబాద్ ముఖం చూసి ఎరుగరు. ఊరిలోనే వ్యవసాయ పనుల్లోనే బతుకును సాఫీగా సాగించేవారు. కానీ, వర్షాలు సరిగ్గా పడక.. వ్యవసాయ పనులు సాగకపోవడంతో బతుకుదెరువు కోసం పట్నం బాటపడుతున్నారు. వీరిలో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చాలా గ్రామాల వాళ్లు ఉన్నారు.
పట్నం చేరినా అరకొర బతుకుదెరువే
పల్లెలో పని లేక హైదరాబాద్ చేరుకున్నా ఇక్కడా బతుకుదెరువు సులువుగా లేదు. పొలంలో మట్టిని నమ్ముకుని బతికిన చేతులు ఇప్పుడు అపార్ట్మెంట్ల గేట్లను కాపలా కాస్తున్నాయి. పంట పొలాల్లో కలుపు తీసిన చేతులు.. ధగధగ మెరిసే నగర భవనాల్లో అంతస్తుల్ని శుభ్రం చేస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పన్నెండు గంటలు పనిచేస్తేనే నెల జీతం. ఆ జీతంతోనే ఇక్కడ ఇంటి అద్దె, తిండి ఖర్చు, పిల్లల చదువు అవసరాలు తీర్చుకుంటున్నారు. గ్రామంలో పొలం పని దొరికితే పట్నం బాట పట్టే అవసరం ఉండకపోయేది. ఇక్కడ కొలువులో చేరిన తర్వాత పన్నెండు గంటల పాటూ అప్పజెప్పిన పని చేస్తూ ఉండడం తప్పనిసరి. సెలవు పెడితే జీతంలో కోత. పల్లెలో ఖాళీగా కూర్చోవడంకంటే నగరంలో ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోక తప్పదనే పరిస్థితుల్లో పట్నం బాట పడుతున్నారు. పుట్టినప్పటి నుంచి ఎన్నడూ పని కోసం హైదరాబాద్ రాలేదని, ఇదే మొదటిసారి అని భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందినవారు వాపోయారు.
ఇంటికి దూరంగా.. బతుకు భారంగా..
హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డులుగా చేరిన కొందరు గ్రామీణ కూలీలు రాత్రింబవళ్లు గేట్ల దగ్గరే కాపుకాస్తున్నారు. నైట్ డ్యూటీలు చేస్తున్నారు. కొందరు హౌస్ కీపింగ్ పనుల్లో చేరుతున్నారు. రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, ప్రైవేటు ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. పని దొరికింది అనే ఊరట ఎలా ఉన్నా.. కుటుంబానికి, సొంతూరికి దూరమయ్యామనే బాధ మాత్రం వారిని వెంటాడుతూనే ఉన్నది. పిల్లల చదువులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి ఖర్చులు.. ఇలాంటివన్నీ గ్రామంలోనే ఉండడంతో అవసరాలకు నగరంలో పని తప్పదని సముదాయించుకుంటున్నారు. పండుగొచ్చినా ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. పొలాల్లో సాగు మొదలైతే తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. సొంతూరిలోని స్నేహితుల నుంచి ఎప్పటికప్పుడు వాన జాడ గురించి తెలుసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి లేదనే సమాధానంతో ఇప్పటికి ఈ నగరమే ఆశ్రయం అని డిసైడ్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన కొందరు మూడు నెలల క్రితమే హైదరాబాద్కు వలసవచ్చారు. తాము గతంలో ఎన్నడూ ఇలా పట్నం వచ్చి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసింది లేదని, ఇప్పుడు తప్పలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
భాష తెలియక ఇబ్బందులు
ప్రైవేటు ఆఫీసుల్లో, అపార్టుమెంట్లలో సెక్యూరిటీ గార్డులుగా చేరిన కొద్దిమంది పేద రైతులు హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పని గతంలో చేసిన అనుభవం లేకపోవడంతో పొరపాట్లతో నిత్యం యజమానుల నుంచి తిట్లు తింటున్నారు. మరికొందరు షాపింగ్ మాల్స్ లో హౌస్ కీపింగ్ పనుల్లో చేరారు. ఊడ్చడం, తుడవడం పనుల్లో పరిజ్ఞానం లేకపోయినా క్రమంగా నేర్చుకుంటున్నారు. కానీ సూపర్వైజర్ హిందీలో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అర్థం కాక వారి ఆగ్రహానికి గురవుతున్నారు. పొట్ట కూటి కోసం ఇలాంటివి భరించక తప్పదని, ఊరిలోని పిల్లల కోసం భరించాల్సిందేనని వారికి వారు సముదాయించుకుంటున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా చేరిన పేద మహిళ ఎన్నడూ చేయని పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నది. కొన్నిసార్లు ఇంగ్లీషు పదాలతో పిలిచే వస్తువులేంటో తెలియక దిక్కులు చూస్తున్నారు. గ్రామాల్లో నైపుణ్యమున్న నాట్లు వేసే కూలీ పనులు లేకపోవడంతో ఇక్కడ బాధలు పడుతున్నారు.
పొట్ట తిప్పలు.. తప్పడం లేదు – రామయ్య, భూపలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల వాసి
‘‘మేం ఎప్పుడూ హైదరాబాద్కు వచ్చింది లేదు. ఇట్ల సెక్యూరిటీ గార్డులుగా గేట్ల ముందు నిలబడి సెల్యూట్ కొట్టిందీ లేదు. కానీ, ఇప్పుడు పొట్ట తిప్పలు..! తప్పడం లేదు!! మా ఊరిలో పొలం పనులు నడుస్తలేవు. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతుంది.. కొడుకు ఆరో తరగతి. వాళ్లను మా బంధువుల ఇంట్లో ఉంచి నేను, మా ఆవిడ రెండు నెలల కింద హైదరాబాద్కు వచ్చినం. నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటే.. నా భార్య పనిమనిషిగా చేస్తున్నది. ఇద్దరికి కలిపి నెలకు రూ. 20 వేలు వస్తాయి. అందులో 6 వేలు ఇంటి కిరాయి పోను.. ఓ 4వేలు మా ఖర్చులకు వాడుకొని.. మిగిలిన డబ్బులను పిల్లల కోసం దాస్తున్నం. వానలు పడి, పొలం పనులు సాగితే.. ఊరికి వెళ్లాలని ఉంది..’’

