కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ‘సర్’ (Telangana SIR) ప్రక్రియ ఆగస్టు 10న ముగియనున్నది. ఇప్పటివరకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయినా బూత్ లెవల్ ఆఫీసర్లకు తిరిగి వచ్చిన ఫారాలు 78 శాతమే. ఇంకా దాదాపు 22% ఫారాలను డిజిటైజ్ చేయాల్సి ఉన్నది. గత నెల 31న డిజిటైజేషన్ 77.12% కంప్లీట్ అయితే తొమ్మిది రోజుల తర్వాత ఆగస్టు 8 నాటికి అది 78.08 శాతానికి చేరుకుంది. తొమ్మిది రోజుల్లో డిజిటైజ్ అయింది కేవలం ఒక శాతం లోపే. మిగిలిన రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికావాలంటే ఇప్పుడు నడుస్తున్న స్పీడ్తో పోలిస్తే వంద రెట్లు పెరగాలి. ఈ పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని మరోసారి పొడిగిస్తుందా? ఇప్పటివరకు పూర్తయినదానితోనే సరిపెట్టుకుంటుందా? అభ్యంతరాలు-పరిష్కారం సమయంలో చేపడుతుందా..? వంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని మొత్తం 3.39 కోట్ల ఓటర్లలో 74.15 లక్షల ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు చేరాల్సి ఉన్నది. ఇప్పటివరకు అమలులో ఉన్న షెడ్యూలు ప్రకారం ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానున్నది. ఆ తర్వాత ఏం జరగనున్నదనేది కీలకం.
రెండు రోజుల్లో 22 శాతం ఎలా?
– ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణలో సర్ ప్రక్రియ ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. గడువు ముగిసేనాటికి వంద శాతం డిజిటైజేషన్ పూర్తికావాల్సి ఉన్నా.. శనివారం రాత్రి నాటికి అది 78 శాతం వద్దే ఆగిపోయింది. మిగిలిన రెండు రోజుల్లో ఏదో అద్భుతం జరుగుతుందనే నమ్మకం రాజకీయ పార్టీల్లో, ప్రజల్లో లేదు.
– ఎన్యూమరేషన్ ఫారాలను వంద శాతం పంపిణీ చేసినప్పటికీ.. భర్తీ చేసిన తర్వాత అవి బీఎల్వోలకు తిరిగి ఎందుకు చేరడం లేదన్నది అనుమానాలకు తావిస్తున్నది. సీఈఓ కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో 90 శాతానికి పైగా డిజిటైజేషన్ పూర్తయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం 65 శాతంలోపే నమోదైంది.
– రాష్ట్రం మొత్తం మీద 3.38 కోట్ల మంది ఓటర్లలో ఆగస్టు 8 నాటికి 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ మాత్రమే పూర్తయింది. దాదాపు 74.15 లక్షల ఫారాల ప్రక్రియను మిగిలిన రెండు రోజుల్లో ఎన్నికల యంత్రాంగం ఏ మేరకు అధిగమిస్తుందన్నది ఆసక్తికరం.
ఓటర్ల నిర్లక్ష్యామా..? బీఎల్వోల వైఫల్యమా..?
ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు పంపిణీ చేసినా అందులో 78 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి. మిగిలిన 75 లక్షల ఫారాలు ఎందుకు రాలేదు? ఓటర్లు లేరా? అడ్రస్ మారారా? ఊరు వెళ్లారా? బీఎల్వోలు ఓటర్ల ఇండ్లకు వెళ్లి సేకరించలేదా? ప్రజలు నిర్లక్ష్యమే కారణమా? బీఎల్వోల వైఫల్యమా? లేక సీఈవో ఆఫీస్ నుంచి పర్యవేక్షణ లోపమా? వంటి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిపై సీఈవో కార్యాలయం అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది. ఇంత ఎక్కువ సంఖ్యలో డిజిటలైజేషన్ కాకుండా మిగిలిపోవడానికి కారణాలపై వివరణ ఇవ్వాల్సి ఉన్నది.
ఏ రాష్ట్రంలోనూ 100% కాలే
– గతంలో ‘సర్’ చేపట్టిన రాష్ట్రాల్లోనూ పూర్తిగా 100% కంప్లీట్ కాలేదు. బిహార్లో గడువు ముగిసే నాటికి 99.8%, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతానికి దగ్గర్లో ఉన్నాయి.
– గోవాలో 99.80%, పుదుచ్చేరిలో 99.83%, ఛత్తీస్గడ్లో 99.83%, మధ్యప్రదేశ్లో 99.89% ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. తెలంగాణలో మాత్రం ఇది 78.08% దగ్గర ఆగిపోయింది. రెండు రోజుల్లో ఇది ఎంత పెరుగుతుందనేది ఆగస్టు 10 సాయంత్రం తర్వాత వెల్లడి కానున్నది.
– హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, తరచూ మారే చిరునామాలు, వలసలు, ఇళ్లలో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఒక బూత్ పరిధిలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉండటం వంటి అంశాలు ఎన్యుమరేషన్ ప్రక్రియపై ప్రభావం చూపినట్లు గతంలోనే సీఈవో స్పష్టం చేశారు.
అంకెల్లో ‘సర్’
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ : 3, 38,26,448
ఆగస్టు 8 నాటికి డిజిటైజ్ అయినవి : 2,64,11,118 (78.08%)
జులై 31 నాటికి కంప్లీట్ అయింది : 2,60,88,334 (77.12%)
ఇంకా కావాల్సినవి : 74,15,330 (21.92%)

