కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం (Yadadri Temple) భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులతో పాటు వరుస సెలవు రోజులు కలిసి రావడంతో స్వామి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి తరలివస్తున్నారు. ఆలయ మాడ వీధులు మొత్తం భక్తులతో నిండిపోయాయి. ధర్మ దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ప్రసాద విక్రయశాలలు, కల్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. పార్కింగ్ స్థలాలు కూడా వాహనాలతో పూర్తిగా నిండిపోయాయి. వ్రత మండపాలు, విశ్రాంతి గదులు కూడా భక్తులతో కిటకిటలాడుతుండటంతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంలో మునిగిపోయాయి.

