కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో రైతుల దుస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. చెమట చిందించి పంటను పండించిన రైతు, ఇప్పుడు అదే వడ్లను కల్లాల్లో ఎండబెట్టుకుంటూ కష్టాల్లో మగ్గుతున్నాడు. కల్లాల్లోని దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన చోట సరైన ఏర్పాట్లు లేకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
కల్లాల్లోనే పేరుకుపోతున్న ధాన్యం
పొలాల్లో పండిన ధాన్యం గోదాములకు వెళ్లాల్సింది పోయి, రోడ్ల పక్కనే, కల్లాల్లోనే పేరుకుపోతోంది. ఎండలో వడ్లు ఎండబెట్టడం,రాత్రిళ్లు కాపలా కాయడం రైతుల రోజువారీ జీవితంగా మారింది. వాన పడితే పంట పాడవుతుందనే భయం, ఎండలో ఉంటే నాణ్యత తగ్గుతుందనే ఆందోళన ఈ సమస్యలు అన్నదాతను మానసికంగా కుంగదీస్తున్నాయి. మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం రైతును అనాథలా వదిలేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పండించడం కంటే అమ్ముకోవడమే కష్టమా?
పంట పండించడం కంటే అమ్ముకోవడమే రైతుకు కష్టంగా మారింది. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కల్లాల్లోనే వడ్లు పాడైపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆశతో రైతు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. కొనుగోలు ఆలస్యం, రవాణాలో జాప్యం వెరసి రైతులు ఆగమవుతున్నారు.

