కలం, వరంగల్ బ్యూరో : విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) అన్నారు. విద్య వారోత్సవాల సందర్భంగా హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా హనుమకొండ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించి మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా శిక్షణ అందిస్తే వారు మంచి ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని ఆయన (MLA Naini Rajender Reddy) తెలిపారు. గతేడాది రాష్ట్రస్థాయిలో హనుమకొండ జిల్లా 18వ స్థానంలో ఉండగా, ఉపాధ్యాయుల కృషి, జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం, విద్యార్థులకు సమర్థవంతమైన విద్యాబోధన అందించడం ద్వారా 2026లో రాష్ట్రస్థాయిలో 9వ స్థానాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేయడం ద్వారా నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గిరిరాజ్, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్
Follow Us On: Instagram

