కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ (KBR Park) చుట్టూ మంగళవారం నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చేపట్టిన హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్ట్ కారణంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రాబోయే రెండేళ్ల పాటు ఈ వన్‌వే విధానం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా నేవిగేషన్ సహాయం కోసం గూగుల్ మ్యాప్స్‌లో సింగిల్ లేన్ రూట్‌కు సంబంధించిన వివరాలను ఇప్పటికే అప్‌డేట్ చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..
రోడ్లపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, రద్దీని నివారించడానికి ట్రాఫిక్ విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 450 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పార్క్ చుట్టూ ఉండే ప్రధాన కూడళ్లలో మోహరించారు. వన్‌వే నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా, నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని, చలాన్లు విధించడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.

