కలం, తెలంగాణ బ్యూరో: ‘సర్’ లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.39 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు కాగా, అందులో 50 శాతానికి పైగా ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోనే ఉన్నట్టు తేలింది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సుమారు 42 లక్షల మంది ఓటర్ల పేర్లు డిలీట్ అయినట్లు ముసాయిదా జాబితాలో వెల్లడైంది. అత్యధికంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 1.40 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి. నగర పరిధిలో 12 నియోజకవర్గాల్లో 40 శాతానికి పైగా ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, చనిపోవడం, పర్మినెంట్‌గా ఇతర ప్రాంతాలకు షిప్ట్ కావడం, డబుల్ ఎంట్రీలు ఉండడం.. ఇలాంటి కారణాలతో పేర్లు గల్లంతయ్యాయి.
ఊహకు అందని రీతిలో…
గ్రామీణ నియోజకవర్గాల్లో పెద్దగా ఓటర్ల సంఖ్య తగ్గకపోయినా అర్బన్ సెగ్మెంట్లలో మాత్రం ఊహకు అందని తీరులో డిలీట్ అయ్యాయి. గల్లంతైన ఓటర్లలో దాదాపు మూడొంతులు అర్బన్ ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్కే అర్బన్ ప్రాంతాల్లో పట్టు ఉంది. గత ఎన్నికల్లో నేరుగా కేటీఆర్ మానిటర్ చేసిన నియోజకవర్గాల్లో ఇప్పుడు భారీ సంఖ్యలో ఓటర్ల సంఖ్య తగ్గడంతో ఇకపై ఆ పార్టీ ఎలాంటి వ్యూహం రూపొందిస్తారన్నది కీలకంగా మారింది. పట్టణ ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో లక్ష ఓట్లు (27.28%), సంగారెడ్డిలో 50 వేల ఓట్లు (19.64%), సికింద్రాబాద్‌లో లక్షకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి.
బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ఎక్కువ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 నియోజకవర్గాల్లో దాదాపు 42 లక్షల మంది ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి. ఇందులో 16 స్థానాలు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నవే ఉన్నాయి. ఇక్కడ దాదాపు 27 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లు వేర్వేరు కారణాలతో డిలీట్ అయ్యాయి. ‘సర్’ తర్వాత ఓటర్ల పేర్లు భారీ స్థాయిలో డిలీట్ అవుతాయని ముందుగానే గ్రహించిన కేటీఆర్, హరీశ్‌రావు.. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా లోకల్ కేడర్‌కు, బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు.
ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా ఇంటింటికీ వెళ్లి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించేలా పర్యవేక్షించాలని, ఓటర్లను గైడ్ చేయాలని సూచించారు. ఇతర పార్టీల కంటే ఎక్కువ మీటింగులు పెట్టి క్యాడర్‌కు వివరించారు. అయినా రాష్ట్రంలో డిలీట్ అయిన మొత్తం ఓటర్లలో దాదాపు 60 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 39 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే, అందులో 16 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి.
కాంగ్రెస్ నియోజకవర్గాల్లో తక్కువ..
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపులు తక్కువే జరిగాయి. రాష్ట్రం మొత్తం మీద 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 శాతం లోపే ఓట్లు గల్లంతయ్యాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని దాదాపు అన్ని స్థానాల్లో తక్కువ పేర్లు గల్లంతయ్యాయి. ఆలేరు నియోజకవర్గంలో అతి తక్కువగా మొత్తం 2.38 లక్షల మంది ఓటర్లలో కేవలం 10 వేల మంది పేర్లు మాత్రమే (4.30 శాతం) డిలీట్ అయ్యాయి. మునుగోడులో 2.63 లక్షల మంది ఓటర్లలో 17 వేల మంది, నకిరేకల్‌లో 2.58 లక్షల మంది ఓటర్లలో 20 వేల మంది పేర్లు డిలీట్ అయ్యాయి.
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, అశ్వారావుపేటలో 10 శాతం లోపే డిలీట్ అయ్యాయి. అర్బన్ నియోకవర్గమైన ఖమ్మంలో మాత్రం 25 శాతం మంది ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి. సీఎం రేవంత్ నియోకవర్గమైన కొడంగల్‌లో మొత్తం 2.51 లక్షల ఓటర్లలో దాదాపు 40 వేల మంది పేర్లు డిలీట్ అయ్యాయి. ఓవరాల్‌గా కాంగ్రెస్ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మినహా మెజారిటీ స్థానాల్లో పేర్ల తొలగింపు తక్కువే.
బీఎల్ఏల నియామకంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం..
ఎన్నికల్లో విజయానికి క్షేత్రస్థాయిలో పనిచేసే బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకమంటూ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పలుమార్లు హెచ్చరించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరంతరం రివ్యూ చేసుకుని, సమన్వయంతో బీఎల్ఏలను గైడ్ చేయాలని ఆమె సూచించారు. కానీ ఇవేవీ గ్రౌండ్లో వర్కవుట్ కాలేదు. ప్రతి పోలింగ్ బూత్‌కు ఒకరు చొప్పున పార్టీలను నియమించాల్సిందిగా సీఈవో ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా రాష్ట్రంలోని సుమారు 36 వేల బూత్‌లకు తగినంతగా పార్టీలు నియమించలేదు.
కొన్ని బూత్‌లు ఒకే ప్రాంగణంలో ఉండడంతో పార్టీలు లైట్‌గానే తీసుకున్నాయి. పార్టీల వారీగా చూస్తే బీఆర్ఎస్ కాస్త యాక్టివ్‌గా ఉండడంతో 20,394 మంది బీఎల్ఏలను నియమించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం 13,144 మందితో సరిపెట్టింది. మీనాక్షి నటరాజన్ ఎంత మొత్తుకున్నా పీసీసీ చీఫ్ మొదలు డీసీసీ ప్రెసిడెంట్ వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెద్దగా సంస్థాగత నిర్మాణమే లేని బీజేపీ 11,621 మంది బీఎల్ఏలను నియమిస్తే.. కాంగ్రెస్ 13,144 మందితోనే సరిపెట్టడం విమర్శలకు దారితీసింది. సీఎం, మీనాక్షి ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రముఖుల నియోజకవర్గాల్లో ఇలా..
- సీఎం రేవంత్ రెడ్డి నియోకవర్గం కొడంగల్‌లో మొత్తం 2.51 లక్షల ఓటర్లలో దాదాపు 40 వేల మంది (15.81%) పేర్లు డిలీట్ అయ్యాయి.
- కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో 2.89 లక్షల ఓటర్లలో 37 వేల మంది (12.95%) పేర్లు డిలీట్ అయ్యాయి.
- కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో మొత్తం 2.46 లక్షల ఓటర్లలో దాదాపు 32 వేల మంది (12.88%) పేర్లు గల్లంతయ్యాయి.
- హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలో 2.44 లక్షల ఓటర్లలో 39 వేల మంది (16.02%) పేర్లు డిలీట్ అయ్యాయి.
సెగ్మెంట్ ఓట్లు గల్లంతైన శాతం
ముషీరాబాద్ 45.17
మలక్‌పేట్ 44.76
జూబ్లీహిల్స్ 44.14
సనత్‌నగర్ 44.93
ఎల్బీనగర్ 44.44

